అభివృద్ధి చేస్తే అద్భుతమే
Published Fri, Mar 31 2017 5:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
► ‘అనంత సాగరం’ వద్ద ఆహ్లాదకర వాతావరణం
► ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధికి అవకాశాలు
అనంతపురం: నగరశివారులోని ‘అనంతసాగరం’ చెరువును మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. పాలకులు చిత్తశుద్ధి చూపితే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయొచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ‘అనంత సాగరం’ జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటి. రాయల కాలంలో నిర్మింపబడి చారిత్రక ప్రాధాన్యతనూ సంతరించుకుంది. చెరువు కట్టపై షిరిడీ సాయిబాబాతో పాటు అనేక ఆలయాలు ఉన్నాయి. ఇవి నగరవాసులకు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి.
ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు చెరువు కట్టపై మార్నింగ్, ఈవినింగ్ వాక్‌కు కూడా వస్తుంటారు. నగర వాసులకు పర్యాటక అనుభూతిని, ఆహ్లాదాన్ని పంచుతున్న ‘అనంత సాగరం’ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.
► హంద్రీ–నీవా జలాలతో చెరువును నింపితే నగర తాగునీటి అవసరాలు శాశ్వతంగా తీరతాయి. ఆయకట్టు రైతులు పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుంది. బోటింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు.
► చెరువు కట్టపై ఫ్లడ్‌లైట్లు, బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందిస్తే మరింత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది.
► జలవనరుల శాఖ రూ.15 కోట్లతో చెరువుకట్ట నుంచి ముసలమ్మకట్ట వరకు రోడ్డు వేస్తోంది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఏర్పాటైతే తాడిపత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు ముసలమ్మ కట్ట నుంచి చెరువుకట్ట మీదుగా కలెక్టరేట్ మార్గానా బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల నగరంలో మరీ ముఖ్యంగా పాతూరులో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.
► అధికార పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నగరంలో రోడ్ల విస్తరణ పేరుతో ఆధిపత్యపోరు నడుస్తోంది. ట్రాఫిక్ సమస్య పేరుతో ఆక్రమణలు తొలగించాలని ఒకరు, అవసరం లేదని మరొకరు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుకట్ట రోడ్డు తెరపైకి వచ్చింది. ఇది పూర్తయితే ఇప్పట్లో విస్తరణ పనులు అవసరం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement