ananthasagaram
-
ఊరు కోసం ప్రాణదానం.. గొల్లభామగా మహిమలు
ఆత్మకూరు: సముద్రాన్ని తలపించేలా పేరుకు తగినట్టుగా ఉన్న ‘అనంతసాగరం’ చెరువును 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల మంత్రి తిమ్మరసుచే నిర్మించబడింది. అనంతరం కొంత కాలానికి ఆయన శిష్యుడు రాయసం కొండ మురసయ్య ఈ చెరువుకు కట్ట నిర్మిస్తుండగా ఓ చోట పెద్ద గండి పడింది. దీంతో గ్రామం నీట మునిగే పరిస్థితి నెలకొంది. గ్రామ పెద్దలు ఏం చేయాలో తెలియక దిక్కు తోచక తలలు పట్టుకున్నారు. ఆ సమయంలో మానవబలి ఇస్తే గండి పూడుతుందని ఆకాశవాణి పలికిందట. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ యాదవ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి ఆ గండిలో నిలబడింది. దీంతో వరద ప్రవాహం నిలిచిపోయిందని, ఆమె త్యాగానికి గుర్తుగా చెరువు కట్టపై శిలను ఏర్పాటు చేసి బలిదానమైన ఆమెకు గుర్తుగా గొల్లభామ శిలగా అప్పట్లో పెద్దలు నామకరణం చేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికి గొల్లభామ విగ్రహం వద్ద స్థానికులు ఆది, మంగళవారాల్లో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ గొల్లభామ స్థంభం కింద గుప్త నిధులు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేయడంతో 2003వ సంవత్సరంలో కొందరు జేసీబీ వంటి యంత్రాలతో తవ్వించేందుకు ప్రయత్నించగా గొల్లభామ శిల మహిమో, మంత్ర మహిమో కాని ఆ జేసీబీ ఆగిపోయి మరమ్మతులకు గురై నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా నిధుల కోసం గుంత తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంతలో తెల్లవారడంతో గ్రామస్తులు వారిని పోలిసులకు పట్టించారు. అప్పటి నుంచి గొల్లభామ మహిమ మరింత విస్తృతమై స్థానికులు మరింత భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. -
నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం రేపింది. ఆనంతసాగరం మండలం రేవూరులో అనుమతి లేకుండా హెలికాప్టర్ లాండింగ్ పై యావత్ యంత్రాంగం ఆశ్చర్య పోయింది. ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఏవియేషన్ అనుమతి తో పాటు స్థానిక పరిపాలన అధికారులు అనుమతి తప్పనిసరి.. కానీ, నెల్లూరు జిల్లా రేవూరు లో అవేవి లేకుండా నే హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కారు లో వచ్చినట్టు ఓ బడా బాబు హెలికాప్టర్ వేసుకొని పెళ్లికి వచ్చేసాడు. (చదవండి : 70 ఏళ్ల వయసులో యూట్యూబ్ సెన్సేషన్) హైదరాబాద్ లో ఉంటున్న సినీ నిర్మాత, మాజీ ఏవియేషన్ అధికారి రామకోటేశ్వర రావు, రేవూరులో జనార్దన్ రెడ్డి అనే ఎన్నారై ఇంట్లో పెళ్లికి హెలికాప్టర్లో వచ్చాడు. ఏవిధమైన అనుమతి లేకుండా, స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ఓసి తీసుకుని ల్యాండ్ కావడంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ నెల 27న గ్రామానికి చెందిన ఎన్నారై బోవెళ్ల జనార్దన్ రెడ్డి ఆహ్వానం మేరకే హెలికాప్టర్ లో కుటుంబ సమేతంగా రామకోటేశ్వర రావు వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ అందులో ఉన్న వ్యక్తులు ను దింపి వెళ్ళిపోయింది. అయితే అందులో ఓ మహిళ కు ఆరోగ్యం బాగలేకపోవడం వలనే ఇలా హెలికాప్టర్ లో వచ్చినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా హెలికాప్టర్ ఘటనని అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధి చేస్తే అద్భుతమే
► ‘అనంత సాగరం’ వద్ద ఆహ్లాదకర వాతావరణం ► ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధికి అవకాశాలు అనంతపురం: నగరశివారులోని ‘అనంతసాగరం’ చెరువును మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. పాలకులు చిత్తశుద్ధి చూపితే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయొచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ‘అనంత సాగరం’ జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటి. రాయల కాలంలో నిర్మింపబడి చారిత్రక ప్రాధాన్యతనూ సంతరించుకుంది. చెరువు కట్టపై షిరిడీ సాయిబాబాతో పాటు అనేక ఆలయాలు ఉన్నాయి. ఇవి నగరవాసులకు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు చెరువు కట్టపై మార్నింగ్, ఈవినింగ్ వాక్కు కూడా వస్తుంటారు. నగర వాసులకు పర్యాటక అనుభూతిని, ఆహ్లాదాన్ని పంచుతున్న ‘అనంత సాగరం’ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ► హంద్రీ–నీవా జలాలతో చెరువును నింపితే నగర తాగునీటి అవసరాలు శాశ్వతంగా తీరతాయి. ఆయకట్టు రైతులు పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుంది. బోటింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ► చెరువు కట్టపై ఫ్లడ్‌లైట్లు, బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందిస్తే మరింత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ► జలవనరుల శాఖ రూ.15 కోట్లతో చెరువుకట్ట నుంచి ముసలమ్మకట్ట వరకు రోడ్డు వేస్తోంది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఏర్పాటైతే తాడిపత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు ముసలమ్మ కట్ట నుంచి చెరువుకట్ట మీదుగా కలెక్టరేట్ మార్గానా బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల నగరంలో మరీ ముఖ్యంగా పాతూరులో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ► అధికార పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నగరంలో రోడ్ల విస్తరణ పేరుతో ఆధిపత్యపోరు నడుస్తోంది. ట్రాఫిక్ సమస్య పేరుతో ఆక్రమణలు తొలగించాలని ఒకరు, అవసరం లేదని మరొకరు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుకట్ట రోడ్డు తెరపైకి వచ్చింది. ఇది పూర్తయితే ఇప్పట్లో విస్తరణ పనులు అవసరం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.