ఆత్మకూరు: సముద్రాన్ని తలపించేలా పేరుకు తగినట్టుగా ఉన్న ‘అనంతసాగరం’ చెరువును 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల మంత్రి తిమ్మరసుచే నిర్మించబడింది. అనంతరం కొంత కాలానికి ఆయన శిష్యుడు రాయసం కొండ మురసయ్య ఈ చెరువుకు కట్ట నిర్మిస్తుండగా ఓ చోట పెద్ద గండి పడింది. దీంతో గ్రామం నీట మునిగే పరిస్థితి నెలకొంది. గ్రామ పెద్దలు ఏం చేయాలో తెలియక దిక్కు తోచక తలలు పట్టుకున్నారు.
ఆ సమయంలో మానవబలి ఇస్తే గండి పూడుతుందని ఆకాశవాణి పలికిందట. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ యాదవ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి ఆ గండిలో నిలబడింది. దీంతో వరద ప్రవాహం నిలిచిపోయిందని, ఆమె త్యాగానికి గుర్తుగా చెరువు కట్టపై శిలను ఏర్పాటు చేసి బలిదానమైన ఆమెకు గుర్తుగా గొల్లభామ శిలగా అప్పట్లో పెద్దలు నామకరణం చేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికి గొల్లభామ విగ్రహం వద్ద స్థానికులు ఆది, మంగళవారాల్లో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలో ఆ గొల్లభామ స్థంభం కింద గుప్త నిధులు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేయడంతో 2003వ సంవత్సరంలో కొందరు జేసీబీ వంటి యంత్రాలతో తవ్వించేందుకు ప్రయత్నించగా గొల్లభామ శిల మహిమో, మంత్ర మహిమో కాని ఆ జేసీబీ ఆగిపోయి మరమ్మతులకు గురై నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా నిధుల కోసం గుంత తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంతలో తెల్లవారడంతో గ్రామస్తులు వారిని పోలిసులకు పట్టించారు. అప్పటి నుంచి గొల్లభామ మహిమ మరింత విస్తృతమై స్థానికులు మరింత భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment