వల్లంపూడి పోలీసు స్టేషన్
చెక్కుచెదరని వల్లంపూడి పోలీస్‌స్టేషన్ భవనం
ఆంగ్ల పాలకుల హయాంలో నిర్మితం
వేపాడ: ఆంగ్ల పాలనలో వల్లంపూడిలో పోలీసు స్టేషన్ కోసం నిర్మించిన భవనం నేటికీ చెక్కు చెదరలేదు. అప్పట్లో నిర్మించిన పెంకుల భవనం, రాతి గోడలు నేటికీ దఢంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. భవనాన్ని నిర్మించి నేటికి 114 ఏళ్లవుతోందని గ్రామానికి చెందిన వయోవద్ధులు చెబుతున్నారు. ఆంగ్ల పాలకులు 1902లో వల్లంపూడిలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు బుదరాయవలస, మానాపురాల్లో ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్లు ఎప్పుడో నేలమట్టమయ్యాయి. వాటిస్థానంలో కొత్త భవనాలు నిర్మించారు. వల్లంపూడిలో ఐదేళ్ల క్రితం కొత్త భవనం నిర్మించినా, ఆంగ్ల పాలకులు నిర్మించిన భవనం నేటికీ వినియోగంలో వుండటం విశేషం. అప్పట్లో బల్లంకి, కష్ణారాయుడుపేట, కోరువాడ, కోడూరు గ్రామాల్లో దొంగలుండేవారు. వారు ముందస్తు సమాచారం ఇచ్చిమరీ చోరీకి పాల్పడేవారు. ఈ పరిస్థితుల్లో వల్లంపూడిలో పోలీసు స్టేషను ఏర్పాటు చేశారు.
డీఎస్పీ వస్తే పల్లకి సేవ: షేక్ ఖాదర్ మొహిద్దీన్, స్వాతంత్య్ర సమరయోధుడు, వేపాడ
వల్లంపూడి పోలీసు స్టేషనుకు రావాలంటే అప్పట్లో సరైన రహదారి ఉండేది కాదు. దీంతో సోంపురం వరకు వాహనంపై వచ్చిన డీఎస్పీని పల్లకిలో వల్లంపూడికి మోసుకొచ్చేవారు. ఆయన వస్తే ఇక్కడ రెండ్రోజులుండి వెళ్లేవారు. ఆయనతో పాటు ప్రత్యేకంగా వంట మనిషిని తీసుకొచ్చేవారు. అప్పట్లో స్టేషనులో 10 మంది కానిస్టేబుళ్లు, ఒక రైటర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉండేవారు.