నిషేధిత ప్రాంతాల్లో స్నానాలు వద్దు
నిషేధిత ప్రాంతాల్లో స్నానాలు వద్దు
Published Thu, Aug 18 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
గుంటూరు ఈస్ట్ : పుష్కర స్నానం కోసం వచ్చే భక్తులు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లతో సిద్ధం చేసిన ఘాట్‌ల వద్దే స్నానం చేయాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విజ్ఞప్తిచేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుచేయని ప్రాంతాల్లో స్నానాలు చేస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అనేక ఘాట్‌ల వద్ద వైద్య, శాంతి భద్రతలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వాటిని వినియోగించుకున్నారన్నారు. కొందరు వ్యక్తులు కొన్ని ప్రైవేటు ఘాట్‌ల వద్ద స్నానం చేస్తున్నారని, అటువంటి వాటిని నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్‌ల వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తుల సౌకర్యం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారని, వీటిని వినియోగించుకుని పుష్కర స్నానాన్ని క్షేమంగా ముగించుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement