AP: నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: దీర్ఘకాలంగా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూముల (22–ఏ) సమస్యలను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఏళ్ల తరబడి పెద్దఎత్తున పేరుకుపోయిన 22 ఏ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా రిటైర్డ్ జిల్లా జడ్జిల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను నియమించాలని నిర్ణయించింది. తొలుత విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు 22 ఏ దరఖాస్తులను పరిశీలించి క్లియరెన్స్‌కు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన సిఫారసులు చేస్తాయి. వాటిని బట్టి కలెక్టర్లు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 22–ఏ భూముల వ్యవహారం సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కలెక్టర్లకు అధికారాలిచ్చినా..
ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన భూములతోపాటు 1954కి ముందు పేదలకు కేటాయించిన భూములు, పలు రకాల కారణాలతో మరికొన్ని భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22 ఏ (నిషేధిత జాబితా) కింద చేర్చారు. ఈ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్టర్ చేయదు. దీంతో వీటి క్రయవిక్రయాలు సాధ్యం కావడంలేదు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని భూ యజమానులు చేసుకుంటున్న దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకుపోతున్నాయి.
చిక్కులు, వివాదాల కారణంగా రెవెన్యూ యంత్రాంగం వాటిపై నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం వీటిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి కలెక్టర్లకు అధికారాలిచ్చినా 22 ఏ దరఖాస్తుల పరిష్కారంలో సరైన పురోగతి లేదని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది.
వీటికి సంబంధించి ప్రభుత్వం, సీసీఎల్ఏకి అందే విజ్ఞప్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో 22–ఏ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జిల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను నియమించాలని నిర్ణయించారు. తొలుత విశాఖపట్నం (విశాఖ, అనకాపల్లి జిల్లాలకు), విజయవాడ (ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు), తిరుపతి (తిరుపతి, నెల్లూరు జిల్లాలకు) ఈ కమిటీలు ఏర్పాటవుతాయి.
రిటైర్డ్ జిల్లా జడ్జి, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, సర్వే, భూమి రికార్డుల శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్/ఆర్డీవో, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ఇందులో సభ్యులుగా ఉంటారు. రిటైర్డ్ జడ్జి, ఇతర రిటైర్డ్ అధికారులను ప్రభుత్వమే నియమించి తగిన వేతనాలు చెల్లిస్తుంది. ఈమేరకు కమిటీల ఏర్పాటు, విధివిధానాలపై ప్రభుత్వం జీవో నెంబర్ 681 జారీ చేసింది.
కమిటీలు ఏం చేస్తాయంటే...
ఈ కమిటీలు 22–ఏకి సంబంధించిన ప్రతి కేసుకు సమయం నిర్దేశించి సంబంధిత అధికారుల సమక్షంలో రికార్డులను పరిశీలిస్తాయి. అన్ని అంశాలు పరిశీలించి దానిపై జిల్లా కలెక్టర్‌కు కచ్చితమైన సిఫారసు చేయాలి. కలెక్టర్ సంబంధిత దరఖాస్తును సాధారణ ప్రక్రియలో ఆమోదించేలా ఆ సిఫారసు ఉండాలి. ఒకవేళ దానిపై ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వానికి పూర్తి వివరాలతో కలెక్టర్ నివేదిక పంపాలి.
ఈ కేసుల్లో రూ.50 కోట్లకు పైగా విలువైన భూములపై తీసుకున్న నిర్ణయాన్ని సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వానికి తెలియచేయాలి. అయితే అలాంటి కేసుల్లో సైతం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నిర్ణయం గురించి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఆ భూములపై జరిగిన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియచేసి నిర్ణయం తీసుకోవాలి. 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22–ఏ పరిధిలోకి వచ్చే అన్ని కేసులు ఈ కమిటీల పరిధిలోకి వస్తాయి.
ఎక్స్ సర్వీస్‌మెన్, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతోపాటు చుక్కల భూములు, మ్యుటేషన్లు కూడా ఈ కమిటీలు పరిశీలించవచ్చు. లక్షల సంఖ్యలో పేరుకుపోయిన 22–ఏ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. లీగల్, రెవెన్యూ అంశాల కారణంగా పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌లో ఉండడంతో నిపుణులైన రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పరిష్కారానికి నడుం బిగించింది.