జగన్నాథుని దేవస్థానం
సాక్షి,భువనేశ్వర్/పూరీ: జగతి నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం లోపల, బయట చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక వాతావరణం కల్పించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాల సంస్కరణకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సింహద్వారం పరిసరాల్లో ఇబ్బందికర పరిస్థితులను నివారించి, రోజువారీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ క్రమంలో సింహద్వారం పరిసరాల్లో బిక్షాటన, విక్రయ కేంద్రాలు, వాహనాల నిలుపుదల వంటి చర్యల నిర్మూలనకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు అధికారిక సమాచారం. జగన్నాథుని దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం లెక్కకు మించిన భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, సందర్శకులు వచ్చిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ జ్యోతిప్రకాష్ దాస్ తెలిపారు.
పార్కింగ్, విక్రయాలు కూడా..
రథయాత్ర సమయంలో మినహా ఇతర రోజుల్లో బొడొ–దండొ ప్రాంగణం అంతా కలుషితం కావడంతో అక్కడికి వచ్చే పర్యాటక వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా అనధికారిక వాహనాల పార్కింగ్ యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో పాటు సింహద్వారం పరిసరాల్లో చిరువ్యాపార దుకాణాలు, ఇతరేతర వ్యవహారాలు కూడా యాత్రికులు, పర్యాటకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.
వీటితో పాటు ఆలయ పరిసరాల్లో జరిగే బిక్షాటన కూడా విచారకర పరిస్థితులను ప్రేరేపిస్తోంది. సింహద్వారం పరిసరాల్లో ఆబోతుల స్వైరవిహారం నిర్మూలనకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే పరిసరాల్లో వాహనాల అనధికారిక పార్కింగ్‌ను కూడా నిషేధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పోలీసు యంత్రాంగం చెబుతోంది. అలాగే పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు జవానులతో పహారా ఏర్పాటు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ ఉమాశంకర దాస్ తెలిపారు.
ప్రతిపాదిత కార్యాచరణ విజయవంతం
జగన్నాథుని ప్రధాన దేవస్థాన ప్రవేశద్వారం పరిసరాల్లో చక్కటి పర్యావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదిత కార్యాచరణను ప్రయోగాత్మకంగా ఆదివారం ప్రారంభించింది. రోజంతా ఈ కార్యాచరణను ప్రయోగాత్మకంగా నిర్వహించి, సింహద్వారం పరిసరాల్లో అనధికారిక పార్కింగ్, బిక్షాటన, విక్రయ సంస్థల నిర్మూలన వంటి చర్యలను విజయవంతంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment