poori jagannath temple
-
ఇకపై దేవస్థానంలో..భిక్షాటన నిషేధం
సాక్షి,భువనేశ్వర్/పూరీ: జగతి నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం లోపల, బయట చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక వాతావరణం కల్పించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాల సంస్కరణకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సింహద్వారం పరిసరాల్లో ఇబ్బందికర పరిస్థితులను నివారించి, రోజువారీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ క్రమంలో సింహద్వారం పరిసరాల్లో బిక్షాటన, విక్రయ కేంద్రాలు, వాహనాల నిలుపుదల వంటి చర్యల నిర్మూలనకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు అధికారిక సమాచారం. జగన్నాథుని దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం లెక్కకు మించిన భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, సందర్శకులు వచ్చిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ జ్యోతిప్రకాష్ దాస్ తెలిపారు. పార్కింగ్, విక్రయాలు కూడా.. రథయాత్ర సమయంలో మినహా ఇతర రోజుల్లో బొడొ–దండొ ప్రాంగణం అంతా కలుషితం కావడంతో అక్కడికి వచ్చే పర్యాటక వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా అనధికారిక వాహనాల పార్కింగ్ యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో పాటు సింహద్వారం పరిసరాల్లో చిరువ్యాపార దుకాణాలు, ఇతరేతర వ్యవహారాలు కూడా యాత్రికులు, పర్యాటకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఆలయ పరిసరాల్లో జరిగే బిక్షాటన కూడా విచారకర పరిస్థితులను ప్రేరేపిస్తోంది. సింహద్వారం పరిసరాల్లో ఆబోతుల స్వైరవిహారం నిర్మూలనకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే పరిసరాల్లో వాహనాల అనధికారిక పార్కింగ్‌ను కూడా నిషేధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పోలీసు యంత్రాంగం చెబుతోంది. అలాగే పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు జవానులతో పహారా ఏర్పాటు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ ఉమాశంకర దాస్ తెలిపారు. ప్రతిపాదిత కార్యాచరణ విజయవంతం జగన్నాథుని ప్రధాన దేవస్థాన ప్రవేశద్వారం పరిసరాల్లో చక్కటి పర్యావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదిత కార్యాచరణను ప్రయోగాత్మకంగా ఆదివారం ప్రారంభించింది. రోజంతా ఈ కార్యాచరణను ప్రయోగాత్మకంగా నిర్వహించి, సింహద్వారం పరిసరాల్లో అనధికారిక పార్కింగ్, బిక్షాటన, విక్రయ సంస్థల నిర్మూలన వంటి చర్యలను విజయవంతంగా నిర్వహించారు. -
తెలుగు రాష్ట్రాలపై తీవ్ర వ్యతిరేకత
భువనేశ్వర్/పూరీ : విశ్వ విఖ్యాత జగన్నాథుని సంస్కృతిపట్ల ఉభయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు సమాచారంతో పాఠ్య పుస్తకాల్ని ప్రచురించాయి. ఈ రెండు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బీఈడీ పాఠ్యాంశాల్లో ఇటువంటి తప్పిదం చోటు చేసుకున్నట్లు రాష్ట్రం దృష్టికి వచ్చింది. ఈ చర్యపట్ల స్థానికంగా జగన్నాథుని సంస్కృతి, పరిశోధన వర్గాలు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. జగన్నాథ సేన ఆధ్వర్యంలో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో బుధవారం భారీ నిరసన ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించిన పాఠ్య పుస్తకాల్లో జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ నిర్వహిస్తోందని ప్రచురితమైంది. అలాగే నవ కళేబరం, గుండిచా యాత్ర వంటి జగన్నాథ సంస్కృతి వ్యవహారాలను పూర్తిగా తప్పుడు సమాచారంతో పాఠ్య పుస్తకాల్ని ప్రచురించినట్లు ఆరోపణ. తక్షణమే ఈ పాఠ్యాంశాల్ని రద్దు చేసి రచయితలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. చర్యలకు ప్రభుత్వం సిద్ధం జగన్నాథుని సంస్కృతి అప ప్రచారంపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఈ వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు తక్షణ చర్యలు చేపడుతుందని ఆ విభాగం మంత్రి అనంత నారాయణ దాస్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలతో జగన్నాథుని ప్రధాన దేవస్థానం సింహద్వారం ఆవరణలో నిరసన ప్రదర్శించారు. -
ఆషాడ మాసం...ప్రత్యేకతల సమాహారం
విజయనగరం : ఆచార వ్యవహారాలకు పెద్దపీటవేసే సంప్రదాయంలో ప్రతీనెలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తొలకరి జల్లులతో ప్రకృతి శోభనందించే వేళ వచ్చేదే ఆషాడమాసం. చంద్రగమనంలో పూర్వాషాడ నక్షత్ర సమీపంలో సంచరించే సమయం కాబట్టి ఆషాడ మాసంగా పిలుచుకుంటాం. శుభకర్యాలకు అవకాశం లేకపోయినా... ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న నెల ఆషాడం. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు, తెలంగాణాలో బోనాలు పండగ, చాతుర్మాస వ్రతాలు.. ఇలా ఎన్నో స్థానిక పండగలతో నెలంతా సందడిగా సాగుతుంది. ఆషాడంలో చేసే దానం, స్నానం, జపం, పారాయణం విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు. ఆషాడంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ముక్తిదాయకమని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని ప్రజల విశ్వాసం. అతివల అరచేతుల్లో అందాలు.. ఆషాడ మాసం వస్తే చాలు .. ఆడవారి అర చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. చక్కని లేత గోరింటాకు రుబ్బి, తమ అరచేతిని ఆకాశాన్ని చేసి అందులో చందమామని, చుక్కల్ని అందంగా తీర్చిదిద్దుతారు. మెహందీ కోన్లు తెచ్చి జిగిబిగి అల్లికలా ముచ్చటైన ఆకృతుల్ని వేసుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు తమ చేతులు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు. ఎర్రగా పండితే చాలు తమ చేతుల్ని అందరికీ చూపిస్తున్నప్పుడు ఆ సమయంలో వారి చేతుల కంటే సిగ్గుతో వారి బుగ్గలే ఎర్రబడతాయి. ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే.. ఆషాడంలో గీష్మరుతువు గడిచిపోతోంది. వర్ష రుతువు ఆరంభమవుతుంది. గ్రీష్మంలో శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఆషాడంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది. ఇలాంటి సమయాల్లో అనారోగ్యాలు తప్పవు. అంతే కాకుండా నిత్యం పనుల్లో ఉండే మహిళల చేతులు, పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేశక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినే టప్పుడు నోటి ద్వారా క్రిములు వెల్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అంతేకాదు... గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయంట. నవ దంపతులకు కష్టకాలం ఆషాడమంటే అందరికీ ఇష్టమైనా.. కొత్తగా పెళ్లైన దంపతులకు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాడంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతుంటారు. అంతే కాకుండా సాగు పనుల్లో క్షణం తీరికలేకుండా ఉంటారు. కాబట్టి కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశంతో ఎడబాటుగా ఉంచుతారు. ఇదిలా ఉండగా శాస్త్రీయ పరమైన కారణమేమిటంటే ఆషాడంలో కొత్త దంపతుల కలయిక వల్ల గర్భం ధరిస్తే... చైత్ర, వైశాఖ మాసంలో పిల్లలు పుడతారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కనే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే ఆషాడంలో కొత్త జంటకు నెలరోజుల పాటు ఎడబాటు తప్పదు. విభిన్న మార్పుల వాతావరణం ఆషాడాన్ని అనారోగ్యా మాసంగా కూడా పిలుస్తుంటారు. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయమిది. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోకి వచ్చి చేరే నీరు మలినంగా ఉండి మనుషులు అనారోగ్యానికి కారణమవుతుంది. కొత్తనీరు తాగడం, వర్షంలో తడవడం వల్ల చలిజ్వరం, విరేచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు ప్రబలుతుంటాయి. గర్భం దాల్చిన స్త్రీలు తగు ఆహార నియమాలు పాటించాల్సిన సమయమిది.శుభకార్యాలకు సెలవుఆషాడ మాసంలో సాధారణంగా శుభకార్యాలు నిర్వహించరు. పూర్వీకులు దీన్ని శూన్యమాసంగా భావిస్తారు. రుతువులు ఈ మాసంతోనే ప్రారంభమవుతాయి కాబట్టి శుభకార్యాలకు మంచిది కాదంటారు. అంతే కాకుండా వర్షాలు ఈ కాలంలోనే ప్రారంభమవుతాయి కాబట్టి వ్యవసాయ పనులు జోరందుకోవడం వల్ల వేరే వ్యాపకంలో ఉండరు. అందుకే గృహప్రవేశం, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, తదితర కార్యాలు ఆషాడంలో నిర్వహించరు. శ్రావణమాసం వచ్చే వరకూ శుభకార్యాలు ఎక్కడా నిర్వహించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోగ్యదాయకం.. గోరింటాకు గోర్లకు పెట్టుకునే ఆకుగా గోరింటాకును వర్ణిస్తారు. రైతులు వ్యవసాయం చేసే సమయమిది. మహిళలు నీటిలో చేతులు పెట్టి వ్యవసాయపనులు చేస్తుంటారు. గోళ్ల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు గోరింటాకును రాత్రివేళ గోళ్లకు పెట్టుకుంటారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు గోళ్లను వదిలేసి, మిగతా చోట మాత్రమే పెట్టుకుంటున్నారు. ఆషాడ మాసంలో గోరింట పెట్టుకోవడం ప్రతి మహిళ అపురూపంగా భావిస్తుంది. ఈ మాసంలో గోరింట పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా మంచిది. అందుకే పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత కూడా ఆషాడ మాసంలో కచ్చితంగా గోరింట పెట్టుకునే అలవాటు ఉంది. –పి. మానస, బ్యూటీషీయన్, విజయనగరం -
వివాదాస్పదం..
భువనేశ్వర్: జగన్నాథుని దేవస్థానంలో భారీ సంస్కరణలకు సుప్రీం కోర్టు నడుం బిగించింది. ఈ కార్యాచరణలో భాగంగా వంశపారంపర్య సంప్రదాయబద్ధంగా సేవాయత్‌ల నియామకం సంస్కరణ అనివార్యంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు పూరీ జిల్లా జడ్జి దాఖలు చేసిన సంస్కరణ మార్గదర్శకాల ఆధారంగా సేవాయత్ల్ని ఇతర సిబ్బంది తరహాలో నియమించి వంశపారంపర్య సంప్రదాయానికి తెర దించాలని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జగన్నాథుని సంస్కృతితో పలు విధాలుగా సంపర్కం కలిగిన వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సేవాయత్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పూరీ జిల్లా జడ్జి సిఫారసులకు ముందు త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించింది. ఈ నేపథ్యంలో సేవాయత్ వర్గం పలు అంశాలకు సంబంధించి పూర్తి వివరణ విచారణ కమిషన్‌కు దాఖలు చేసింది. ఈ వివరాలపై సుప్రీం కోర్టు దృష్టి పడకపోవడం ఏమిటని సేవాయత్ వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీసింది. పూరీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి మహేశ్వర మహంతి, లోక్ సభ సభ్యుడు పినాకి మిశ్రా సారథ్యంలో 22 మంది సభ్యుల సేవాయత్ ప్రతినిథి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆదివారం భేటీ అయింది. దేవస్థానం సంస్కరణల నేపథ్యంలో విచారణ కమిటీకి తమ వర్గం ప్రతిపాదించిన వివరాల్ని విస్మరించి సుప్రీం కోర్టుని దారి తప్పించినట్టు సేవాయత్ వర్గం ఆరోపించింది. ఈ పరిస్థితుల్ని సవరించాలని ముఖ్యమంత్రి చొరవ కల్పించుకోవాలని అభ్యర్థించారు. జగన్నాథుని తీరే వేరు: పినాకి మిశ్రా శ్రీమందిరం సంస్కరణలు పురస్కరించుకుని సేవాయత్‌ల ప్రత్యక్ష నియామకం ప్రతిపాదన తీవ్ర కలకలం రేకెత్తించింది. జగన్నాథుని సంస్కృతిని ఇతర దేవస్థానాలతో పోల్చి నిర్ణయాలు తీసుకోకుండా ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంది. ఇతర దేవస్థానాల్లో మూల విరాట్ల స్థితిగతులు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల్ని సమీక్షిస్తే ఈ పరిస్థితులు స్పష్టం అవుతాయి. ఈ దేవస్థానంలో సజీవ మూర్తులు పూజలు, సేవలు, అర్చనలు అందుకుంటున్న విషయాన్ని సంస్కరణ నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఈ పరిస్థితుల్ని సుప్రీం కోర్టుకు సవివరంగా తెలియజేయగలిగితే సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందని సేవాయత్ వర్గానికి ప్రాతినిథ్యం వహించిన పూరీ లోక్ సభ సభ్యుడు పినాకి మిశ్రా తెలిపారు. సుప్రీం కోర్టు సంప్రదింపులతో యామికస్ క్యూరే గోపాల సుబ్రహ్మణ్యం రాష్ట్రానికి త్వరలో విచ్చేస్తారన్నారు. ఆయన రాక పురస్కరించుకుని పూరీ జగన్నాథుని ప్రాచీన సంస్కృతి ప్రధానంగా సజీవ మూర్తులకు అర్చన ఆరాధనలు జరుగుతున్న అద్భుత సంస్కృతిని వివరించాల్సి ఉందన్నారు. దీంతో ముడిపడిన సేవాయత్‌ల నియామకం ఆవిర్భావం సవివరంగా తెలియజేస్తే పరిస్థితి కుదుట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల అభిప్రాయం కీలకం విశ్వవ్యాప్తంగా జగన్నాథుని భక్తులు విస్తరించి ఉన్నారు. శ్రీ మందిరం సంస్కరణలు పురస్కరించుకుని ఈ వర్గం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం. దీంతో పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ్ దేవ్, గోవర్థన పీఠాధిపతి ఆది శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి, 36 వర్గాల నియోగుల అభిప్రాయాల్ని క్రోఢీకరించి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పినాకి మిశ్రా ప్రతిపాదించారు. -
ఆ గుడి ప్రాంగణంపై చాపర్ల చక్కర్లు వద్దు!
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాధ్ ఆలయంపై భాగం మీదుగా హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించేందుకు అనుమతించొద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. జూలై 18, 26, 27 తేదీల్లో ఆలయానికి సంబంధించి నబకళేబర ఉత్సవాలు జరుగుతున్నందున్న ఆలయ భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలో గగన తల మార్గానికి అనుమతించకూడదని కోరారు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్, భువనేశ్ర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ డైరెక్టర్ బిజు పట్నాయక్ కు లేఖలు రాసింది. వాటి వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించింది. పూరీలోని జగన్నాథ ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైనది.