ముఖ్యమంత్రిని కలిసిన సేవాయత్ బృందం
భువనేశ్వర్: జగన్నాథుని దేవస్థానంలో భారీ సంస్కరణలకు సుప్రీం కోర్టు నడుం బిగించింది. ఈ కార్యాచరణలో భాగంగా వంశపారంపర్య సంప్రదాయబద్ధంగా సేవాయత్‌ల నియామకం సంస్కరణ అనివార్యంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు పూరీ జిల్లా జడ్జి దాఖలు చేసిన సంస్కరణ మార్గదర్శకాల ఆధారంగా సేవాయత్‌ల్ని ఇతర సిబ్బంది తరహాలో నియమించి వంశపారంపర్య సంప్రదాయానికి తెర దించాలని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది.
ఈ ఉత్తర్వులపై జగన్నాథుని సంస్కృతితో పలు విధాలుగా సంపర్కం కలిగిన వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సేవాయత్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పూరీ జిల్లా జడ్జి సిఫారసులకు ముందు త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించింది.
ఈ నేపథ్యంలో సేవాయత్ వర్గం పలు అంశాలకు సంబంధించి పూర్తి వివరణ విచారణ కమిషన్‌కు దాఖలు చేసింది. ఈ వివరాలపై సుప్రీం కోర్టు దృష్టి పడకపోవడం ఏమిటని సేవాయత్ వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీసింది.
పూరీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి మహేశ్వర మహంతి, లోక్ సభ సభ్యుడు పినాకి మిశ్రా సారథ్యంలో 22 మంది సభ్యుల సేవాయత్ ప్రతినిథి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆదివారం భేటీ అయింది.
దేవస్థానం సంస్కరణల నేపథ్యంలో విచారణ కమిటీకి తమ వర్గం ప్రతిపాదించిన వివరాల్ని విస్మరించి సుప్రీం కోర్టుని దారి తప్పించినట్టు సేవాయత్ వర్గం ఆరోపించింది. ఈ పరిస్థితుల్ని సవరించాలని ముఖ్యమంత్రి చొరవ కల్పించుకోవాలని అభ్యర్థించారు.
జగన్నాథుని తీరే వేరు: పినాకి మిశ్రా
శ్రీమందిరం సంస్కరణలు పురస్కరించుకుని సేవాయత్‌ల ప్రత్యక్ష నియామకం ప్రతిపాదన తీవ్ర కలకలం రేకెత్తించింది. జగన్నాథుని సంస్కృతిని ఇతర దేవస్థానాలతో పోల్చి నిర్ణయాలు తీసుకోకుండా ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంది.
ఇతర దేవస్థానాల్లో మూల విరాట్ల స్థితిగతులు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల్ని సమీక్షిస్తే ఈ పరిస్థితులు స్పష్టం అవుతాయి. ఈ దేవస్థానంలో సజీవ మూర్తులు పూజలు, సేవలు, అర్చనలు అందుకుంటున్న విషయాన్ని సంస్కరణ నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం అవసరం.
ఈ పరిస్థితుల్ని సుప్రీం కోర్టుకు సవివరంగా తెలియజేయగలిగితే సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందని సేవాయత్ వర్గానికి ప్రాతినిథ్యం వహించిన పూరీ లోక్ సభ సభ్యుడు పినాకి మిశ్రా తెలిపారు. సుప్రీం కోర్టు సంప్రదింపులతో యామికస్ క్యూరే గోపాల సుబ్రహ్మణ్యం రాష్ట్రానికి త్వరలో విచ్చేస్తారన్నారు.
ఆయన రాక పురస్కరించుకుని పూరీ జగన్నాథుని ప్రాచీన సంస్కృతి ప్రధానంగా సజీవ మూర్తులకు అర్చన ఆరాధనలు జరుగుతున్న అద్భుత సంస్కృతిని వివరించాల్సి ఉందన్నారు. దీంతో ముడిపడిన సేవాయత్‌ల నియామకం ఆవిర్భావం సవివరంగా తెలియజేస్తే పరిస్థితి కుదుట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భక్తుల అభిప్రాయం కీలకం
విశ్వవ్యాప్తంగా జగన్నాథుని భక్తులు విస్తరించి ఉన్నారు. శ్రీ మందిరం సంస్కరణలు పురస్కరించుకుని ఈ వర్గం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం. దీంతో పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ్ దేవ్, గోవర్థన పీఠాధిపతి ఆది శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి, 36 వర్గాల నియోగుల అభిప్రాయాల్ని క్రోఢీకరించి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పినాకి మిశ్రా ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment