puskara bath
-
కదిలివచ్చిన వంశ వృక్షం
దాచేపల్లిలోని అంబటి వంశీకులైన సుమారు 70 కుటుంబాలకు చెందిన 350 మందికి పైగా భట్రుపాలెం ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. కృష్ణమ్మ తల్లికి నమస్కరించి పసుపు, కుంకుమ, చీరెలు నదిలో వదిలిపెట్టారు. అనంతరం పితరులకు పిండప్రదానం చేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఘాట్ వద్దే సహపంక్తి భోజనాలు చేశారు. – భట్రుపాలెం (దాచేపల్లి) -
నాలుగు తరాల పుష్కర స్నానం
అమరావతి (పెదకూరపాడు) : కుటుంబ బంధాలు మరి చిన ఈ రోజుల్లో నాలుగు తరాల వారు ఒక చోటకు చేరి పుష్కర స్నానం ఆచరించడం అరుదుగా కనిపిస్తుంది. అమరావతికి చెందిన వెంకట కోటయ్య కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు అమరావతిలోని అమరేశ్వర ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు. హైదరాబాద్,అమెరికా, డెన్మార్క్, దుబాయ్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు తరాల వారు ఒక చోటకు చేరి పుష్కర స్నానం ఆచరించడం విశేషం. -
అడ్డంకి వచ్చినా...ఆగేది లేదు...
అమరావతి (పట్నంబజారు) : పుష్కర స్నానానికి ఎటువంటి అడ్డంకి వచ్చినా.. ఆగేది లేదని నిరూపించిందామె. తాడికొండకు చెందిన ధనలక్ష్మి వికలాంగురాలు కావడంతో బంధువులు చేతులతో ఎత్తుకువచ్చి మరీ ధ్యానబుధ్ధ ఘాట్ లో స్నానం చేయించారు. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద వీల్ఛైర్లు కనపడకపోవడంతో నేరుగా కుటుంబ సభ్యులే ఇలా తీసుకుని వచ్చారు. -
నిషేధిత ప్రాంతాల్లో స్నానాలు వద్దు
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఈస్ట్ : పుష్కర స్నానం కోసం వచ్చే భక్తులు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లతో సిద్ధం చేసిన ఘాట్ల వద్దే స్నానం చేయాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విజ్ఞప్తిచేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుచేయని ప్రాంతాల్లో స్నానాలు చేస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అనేక ఘాట్ల వద్ద వైద్య, శాంతి భద్రతలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వాటిని వినియోగించుకున్నారన్నారు. కొందరు వ్యక్తులు కొన్ని ప్రైవేటు ఘాట్ల వద్ద స్నానం చేస్తున్నారని, అటువంటి వాటిని నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తుల సౌకర్యం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారని, వీటిని వినియోగించుకుని పుష్కర స్నానాన్ని క్షేమంగా ముగించుకోవాలని సూచించారు. -
మహానేత ఆత్మశాంతి కోసం ..
రెంటచింతల: జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మశాంతి కోసం సీతానగరం పుష్కరఘాట్‌లో రెంటచింతల మండల నేతలు, కార్యకర్తలు పిండప్రదానం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను, ప్రజలు పడుతున్న బాధలను చూసి వైఎస్ ఆత్మ ఘోషిస్తోందని వారు పేర్కొన్నారు. అనంతరం వైఎస్సార్‌కు నేతలు, కార్యకర్తలు పిండప్రదానం చేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన సభ్యులు మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, రెంటచింతల సర్పంచ్ గుర్రాల రాజు, ఉపసర్పంచ్ ఏలూరి సత్యం, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు ఏరువ శౌరెడ్డి, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, గొట్టం పద్మాజానాసరరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బొంకూరు తిరుపతిరావు, పార్టీ నేతలు పమ్మి సీతారామిరెడ్డి, ఓర్సు కాశయ్య, తిరుపతిరెడ్డి, కిషోర్ తదితరులున్నారు. -
కోటికి చేరువలో..
సాక్షి, కొవ్వూరు : జిల్లాలోని 97 ఘాట్లలో గడచిన తొమ్మిది రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 91లక్షల 87 వేల 752కు చేరింది. కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, పెనుగొండ మండలాల్లో గల ఘాట్లలో 60,63,775 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లోని ఘాట్లలో 27,49,327 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 3,74,750 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. బుధవారం సాయంత్రం 8 గంటల వరకు జిల్లాలో 10,26,170 మంది పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లావ్యాప్తంగా బుధవారం వేకువజామునుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. జిల్లాలో సగటున 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిపి లేకుండా వాన కురిసినా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
సాధువుల పుష్కర స్నానానికి రూ.1.50కోట్లు!
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి వచ్చే 1,500 మంది సాధువులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఏర్పాట్ల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే.. పుష్కర ఏర్పాట్లలో భాగంగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. వివిధ జిల్లాల్లో జరుగుతున్న పుష్కర పనుల కోసం ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.2 కోట్లను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.