శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకం
– అదనపు ఎస్పీ మాల్యాద్రి
– ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం
అనంతపురం సెంట్రల్ : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఎస్పీ మాల్యాద్రి అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో 54వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత హోంగార్డుల ప్లటూన్ల నుంచి ఏఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1963లో మొట్టమొదటి సారిగా మహారాష్ట్రలో ప్రారంభమై హోంగార్డుల వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరించిందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోంగార్డుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించడం జరుగుతోందని వివరించారు. సాధారణ పరిస్థితుల నుంచి క్లిష్ట పరిస్థితుల వరకూ హోంగార్డుల సేవలు కీలకమయ్యాయని సూచించారు. నేరాల నియంత్రణ, ఛేదింపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ముఖ్యుల, ప్రముఖుల బందోబస్తు తదితర సందర్భాల్లో హోంగార్డులు సేవలు ప్రశంసనియ్యమన్నారు. అనంతరం క్రీడల్లో విజేతలైన హోంగార్డులకు బహుమతులు అందజేశారు.
షాట్‌పుట్ మహిళా విభాగంలో ప్రతిభ కనబరిచిన షామినా, నిర్మల, రేణుకాబాయిలకు బహుమతులు అందజేశారు. అనంతరం నగరంలో హోంగార్డులు భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానం వద్ద అదనపు ఎస్పీ మాల్యాద్రి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కోర్టురోడ్డు, టవర్‌క్లాక్, సుబాష్‌రోడ్డు, సప్తగిరిసర్కిల్ మీదుగా పోలీస్ హెడ్‌క్వాటర్స్ వరకూ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఆర్‌ఐలు మోసెస్‌బాబు, వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐలు నిరంజన్, జాఫ్‌ర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.