మంత్రిని ప్రశ్నిస్తే... ఎంపీగారికి కోపం వచ్చింది
హైదరాబాద్: బ్యాంకులకు బకాయిపడినట్లు వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏ విషయమైనా కావాలనుకుంటే కంపెనీ ప్రతినిధులను కలుసుకోవాలని ఆయన తెలిపారు. శుక్రవారం నగరంలోని సీసీఎంబీ ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని... మొక్కలు నాటారు.
అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం మరింత ప్రగతి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పదవి చేపట్టిన మీరు బ్యాంకులకు బకాయిలు పడినట్లు మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయని వాటిపై మీ స్పందన ఏమిటని విలేకర్లు సుజనాచౌదరిని ప్రశ్నించారు. దీనిపై సుజనాపై విధంగా స్పందించారు.
సుజనా చౌదరిపై విలేకర్లు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో అక్కడే ఉన్న బాపట్ల టీడీపీ ఎంపీ మాల్యాద్రి అసహనానికి గురైయ్యారు. మీరు ఏ పత్రిక నుంచి వచ్చారు? ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారంటూ విలేకర్లపై బెదిరింపు ధోరణితో వ్యవహారించారు. మాల్యాద్రి తీరుపై విలేకర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద కోల్పోవద్దంటూ మాల్యాద్రికి విలేకర్లు హితవు పలికారు.