వచ్చామా.. చూశామా... వెళ్లామా...!
బాలుర పరిశీలనా గృహాన్ని సందర్శించిన సుజనాచౌదరి
ప్రోటోకాల్ పాటించని అధికారులు
విజయవాడ(భవానీపురం) : వచ్చామా.. చూశామా.. వెళ్లామా.. అన్నట్లుంది కేంద్రమంత్రి సుజనా చౌదరి తీరు. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో అక్కడ ఎవరికీ అర్ధం కాలేదు. అయితే సుజనా వస్తున్నారని తెలిసి తెలుగు తమ్ముళ్లు చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. చైల్డ్‌కేర్ సంస్థల పని తీరును పరిశీలన చేయాల్సిందిగా మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధి సూచనల మేరకు సుజనా విద్యాధరపురం కబేళా రోడ్డులోని ప్రభుత్వ బాలుర పరిశీలనా కేంద్రానికి శుక్రవారం వచ్చారు. తొలుత విచారణలో ఉన్న బాలురతో ముచ్చటించారు.
ఇక్కడి ఎందుకు వచ్చారు, నేరాలు చేసి వచ్చారా, మోపబడి వచ్చారా, ఇక్కడి పరిస్థితులేమిటి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు. విచారణలో ఉన్న బాలురకు చదువు చెప్పిద్దామంటే వారికి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి అని పేర్కొన్నారు. విచారణలో ఉన్నప్పటికీ జనజీవన స్రవంతిలో కలిపి సమాజంపై అవగాహన కల్పించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పశ్చిమ ఇన్‌చార్జ్ కె.నాగుల్‌మీరా, టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి హరిబాబు, కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, వి.హరనాథస్వామి, కె.వెంకటేశ్వరరావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
జలీల్‌ఖాన్ దూరం
‘ఉన్నదీ పోయె.. ఉంచుకున్నదీ పోయె’ అన్నట్లుంది జలీల్‌ఖాన్ పరిస్థితి. పార్టీ వీడిన తరువాత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. మారిన టీడీపీలో కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కూడా పిలవలేదని సమాచారం. కాగా కార్యక్రమం జరిగిన డివిజన్ కార్పొరేటర్ సంధ్యారాణికి సమాచారం అందించ కపోవడంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.