ఉరేసుకుని హోంగార్డు ఆత్మహత్య
♦ కుటుంబ కలహాలే కారణం..
♦ పెద్దదోర్నాలలో ఘటన..
పెద్దదోర్నాల: చెట్టుకు ఉరేసుకుని హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక వ్యవసాయ భూముల్లో శుక్రవారం జరిగింది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే గోనా మల్లికార్జున(34) పెద్దదోర్నాల పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవల తన సొంత సోద రుడి భార్య.. మల్లికార్జునతో పాటు ఆయన భార్య, తమ్మునిపై వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం రోడ్డు కస్తూరిబా బాలికల పాఠశాల వెనుక భాగంలోని వ్యవసాయ భూమిలో ఓ చెట్టుకు మల్లికార్జున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న గంగమ్మ మృతి
గుంటూరు ఈస్ట్: మేదరమెట్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరాస్వామి భార్య గంగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీంతో ప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వీరాస్వామి, అతని కోడలు మాధవి, కూతురు లక్ష్మీప్రసన్నలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.