
పేదలపై పెనుభారం
► ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్ల ధరలు భారీగా పెంపు
► ఒక్కో ఇంటి రేటు రూ.5.14 లక్షల నుంచి రూ.7.90 లక్షలు
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రూ.3లక్షలు
► మిగిలిన సొమ్ము లబ్ధిదారుని వాటా
► వైఎస్ హయాంలో రూ.40 వేలకే జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇల్లు
► పేదల సొంతింటి ఆశలతో టీడీపీ సర్కారు ఆటలు
రాజధాని నేపథ్యంలో విజయవాడలో ఇంటి అద్దెలు అనూహ్యంగా పెరిగాయి. సంపాదనలో సగభాగం అద్దెలకే సరిపోతుంది. ఈ క్రమంలో సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని ప్రజలు ఆశపడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హౌసింగ్ ఫర్ ఆల్ తెరపైకి రావడంతో సంబరపడ్డారు. అయితే, ఏడాదిగా ఊరిస్తున్న ఈ పథకానికి సంబంధించి తాజాగా ఖరారైన విధి విధానాలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.40 వేలకే పేదలకు జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇల్లు ఇచ్చారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో ఇంటి ధరను రూ.5.14 లక్షల నుంచి రూ.7.90 లక్షల వరకు నిర్ణయించింది. దీంతో సబ్సిడీ రూ.3లక్షలు మినహాయించగా, ఒక్కో లబ్ధిదారుడు రూ.2.14లక్షల నుంచి రూ.4.90 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాథమికంగా నిర్ణయించిన ఇళ్ల ధరలు ఇలా...
300 చ.అ : ధర రూ.5,14,000 నుంచి రూ.5,85,000
365 చ.అ : ధర రూ.6,48,000 నుంచి రూ.6,90,000
430 చ.అ : ధర రూ.7,40,000 నుంచి రూ.7,90,000
విజయవాడ సెంట్రల్ : సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వ తోడ్పాటు కోసం ఎదురు చూస్తున్న పట్టణాల్లోని పేదలపై టీడీపీ సర్కారు పెనుభారం మోపేందుకు సిద్ధమైంది. ఒకవైపు సబ్సిడీ ఇస్తున్నామని చెబుతూనే ఇంటి ధరను భారీగా పెంచేసింది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లబ్ధిదారుడు రూ.40 వేలు చెల్లించగా జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇల్లు ఇచ్చారు. అప్పట్లో పెరిగిన ధరల దృష్ట్యా మరో 16వేలను పెంచారు.
అదే తరహాలో ఇప్పుడు కూడా ఇల్లు వస్తుందనుకున్న పేదల ఆశలపై టీడీపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. లబ్ధిదారుల వాటాను రూ.2.14లక్షల నుంచి రూ.4.90 లక్షలకు పెంచేసింది. దీంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ హయాంలో 14 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇప్పుడు లబ్ధిదారుని వాట భారీగా పెంచడం వల్ల ఎంత మందికి మేలు కలుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
రెండోసారి శంకుస్థాపన...
పట్టణ పేదల గృహ నిర్మాణానికి ఏడాది కిందట జక్కంపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నగరంలో పది వేల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే, అక్కడ ఇప్పటికీ ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్ సంయుక్త ఆధ్వర్యాన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సోమవారం 38 పట్టణాల్లో 1.93 లక్షల గృహాలకు సీఎం శంకుస్థాపన చేశారు. జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు స్థాయిల్లో ఈ ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. వీటి నిర్మాణం 15 నెలల్లో పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే హఠాత్తుగా ప్రభుత్వానికి పేదల ఇళ్లు గుర్తుకొచ్చాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాంకేతికత సాకుతో...
షేర్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో చేపట్టనున్న గృహ నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, పల్లోంజి, కేఎన్‌వీ ప్రాజెక్ట్ వంటి బడా సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వ భావిస్తోంది. పర్యవేక్షణ బాధ్యతలను టిడ్కో, నగరపాలక సంస్థ సంయుక్తంగా చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. మిగితా మొత్తాన్ని బ్యాంక్ రుణంగా ఇప్పిస్తామని చెబుతున్నారు. సాంకేతిక సాకుతో గృహ నిర్మాణ ధరలను అనూహ్యంగా పెంచడం ద్వారా పొమ్మనలేక పొగపెట్టిన చందంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర పథకం హైజాక్‌కు యత్నం...
హౌసింVŠ æఫర్ ఆల్ పథకానికి టీడీపీ సర్కార్ పచ్చ కలర్ ఇస్తోంది. రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల వ్యయంతో 10లక్షల 30 వేల గృహాలను నిర్మించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ప్రతి ఇంటికి రూ.3 లక్షల చొప్పున సబ్సిడీ ఉంటుంది. ఇందులో రూ.1.50 లక్షలను కేంద్ర ప్రభుత్వం, రూ.1.50లక్షలను రాష్ట్రంప్రభుత్వం భరిస్తాయి. దేశంలోని అందరికీ 2022 నాటికి సొంత ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 38 పట్టణాల్లో 1.93 లక్షల ఇళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే సీఎం స్వత్కర్షకే ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు దారితీసింది. కేంద్ర పథకాన్ని హైజాక్ చేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.