ఇలాగైతే సమన్వయం ఎలా?
ఇలాగైతే సమన్వయం ఎలా?
Published Sat, Aug 27 2016 9:58 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
* టీడీపీ సమీక్షా సమావేశానికి జిల్లా మంత్రులు, పరిశీలకుడు డుమ్మా
* ముగ్గురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు
* నామినేటెడ్ పదవులపై నిర్ణయం తీసుకోని ఇన్‌చార్జి మంత్రి
* మొక్కుబడిగా సమావేశంపై కార్యకర్తల అసంతృప్తి
గుంటూరు (అరండల్‌పేట): ఇలాగైతే నేతల మధ్య సమన్వయం ఎప్పటికి సాధ్యమవుతుంది... పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు కనీసం పార్టీ సమావేశం అంటే అంత చులకనైతే ఎలా అంటూ టీడీపీ కార్యకర్తలు పార్టీ నాయకులను నిలదీశారు. జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం అరండల్‌పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో సహా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయింది. ఇలాగైతే పార్టీకోసం ఎవరు పనిచేస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత నెలలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎందుకు అమలు చేయలేదంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రధానంగా పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. గత నెలలో జరిగిన సమావేశంలో మిర్చి యార్డుకు సంబంధించిన డైరెక్టర్ల పేర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలను బుచ్చయ్యచౌదరి ఆదేశించినా ఇప్పటివరకు పేర్లు ఇవ్వలేదు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న యార్డు చైర్మన్ పదవులకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పేర్లు ఇవ్వలేదు. దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ సమావేశంలో తూతూ మంత్రంగా నాలుగు తీర్మానాలు చేసి పార్టీకి పంపడం తప్ప ఈ సమావేశంతో ఒరిగిందేమీ లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులతో పాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం హాజరుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీరంతా కార్యకర్తల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే రాలేదని విమర్శిస్తున్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఒక్కసారి కూడా ఎంపీలు హాజరుకాకపోవడం, పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మరికొందరు నాయకులు చెబుతున్నారు.
Advertisement
Advertisement