
ఎన్నాళ్లు ఈ చెట్ల కింద చదువులు
నిత్యం మూడు తరగతులు చెట్ల కిందనే
పేరుకే సక్సెస్ పాఠశాల
మౌలిక సదుపాయాల కల్పనలో శూన్యం
నూతన గదులు మంజురు చేయాలని కోరుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
చిలుకూరు
క్యాలెండర్‌లో తేదీలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మాత్రం మారడం లేదు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారు. ఇందుకు నిదర్శనమే చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల. పేరుకే ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల. కాని వసుతులు చూస్తే మాత్రం అంతా శూన్యమే. ప్రతి ఏడాది ఈ పాఠశాలలో పదవ తరగతిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్‌లు ఎంపిక కావడం, విద్యార్థులకు పాఠశాలలో పాఠాలు బోధించడం అంతా సక్రమంగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాధి గణనీయంగా పెరుగుతూ వస్తుంది. కానీ పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు సరిపడా లేకపోవడంతో చెట్ల కింద చదువులు తప్పడం లేదు. చెట్ల కింద పాఠాల బోదన అంటే తాము సైతం ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు సైతం అంటున్నారు. తరగతి గది వాతావరణం లేకపోవడంతో భయట విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆటంకం కలుగుతుందని అంటున్నారు.
మూడు తరగతులు చెట్ల కిందనే..
చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల పాఠశాల సక్సెస్ పాఠశాల కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలు ఉన్నాయి. మొత్తం ఈ పాఠశాలలో 430 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ చొప్పున విద్యార్థులకు సంబంధించి తరగతి గదులు 10 గదులు కావాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులు, కంప్యూటర్ గది, ఉపాధ్యాయులు గదితో కలుపుకొని మొత్తం 13 గదులు కావాల్సి ఉంది. అయితే ఈ పాఠశాలలో 10 గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో నిత్యం మూడు తరగతులు వారు చెట్ల కింద ఉండాల్సిందే. సక్సెస్ పాఠశాలగా ఎంపిక చేసిన తరువాత అదనపు గదులు కూడ మంజూరు చేయాల్సి ఉన్నప్పుటికి నేటి వరకు గదులు మంజూరు చేయలేదు. దీంతో విద్యార్థులు చాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అదికారులు చొరవ తీసుకొని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని పలువురు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.