నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ. 24.35 లక్షలు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. 24.35 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయంలో లెక్కించారు. ఈఓ తో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటు చేసిన 24 హుండీలను లెక్కించగా 63 రోజులకు గానూ రూ.24, 35, 535 నగదుతోపాటు, 8 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా రూ.18,712 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు తలారి రామలింగ, జగదీష్ ప్రసాద్ శారడ, సతీష్ గుప్త, ఇతర ఆలయ సిబ్బందితో పాటు, ఆర్టీసీ సేవాసమితి, సత్యసాయి సేవాసమితి, హనుమాన్ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.