13 మండలాల్లో వంద శాతం సర్వే
– తక్కువ శాతం మైదుకూరు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో
– జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం
ప్రొద్దుటూరు టౌన్: జమ్మలమడుగు డివిజన్‌లోని 16 మండలాల్లో 13 మండలాలు ఇప్పటికే వంద శాతం సర్వే పూర్తి చేశాయని జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో ఆర్డీఓ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలో మొత్తం 2,37,412 గృహాలు ఉన్నాయన్నారు. 16 మండలాలకు సంబంధించి లక్షా 60వేల 377 గృహాలు ఉన్నాయని, వీటిలో 8,800 గృహాలు సర్వేలో పెండింగ్ ఉన్నాయని తెలిపారు. మొత్తం 96 శాతం మండలాల్లో సర్వే పూర్తి చేశామని వివరించారు. ప్రొద్దుటూరు మండలంలో 5వేల గృహాలు, దువ్వూరులో 1800, వేంపల్లిలో 2వేల గృహాల సర్వే చేయాల్సి ఉందని, మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. మున్సిపాలిటీల పరిస్థితికి వస్తే జమ్మలమడుగు 65 శాతం, పులివెందుల 42 శాతం, ప్రొద్దుటూరులో 27శాతం, మైదుకూరులో 13 శాతం మాత్రమే సర్వే జరిగిందన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇప్పటికి 14వేల గృహాలు సర్వే పూర్తయ్యాయని, మరో 26వేల గృహాలు సర్వే చేయాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం నుంచి 85 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో ఉంటారని తెలిపారు. ఇతర మండలాల నుంచి 48 మందిని సర్వేకి నియమించామన్నారు. రూరల్ పరిధిలో మొత్తం 478 మంది ఎన్యుమరేటర్లు, మున్సిపాలిటీల పరిధిలోని 199 మంది ఎన్యుమరేటర్లు విధుల్లో ఉన్నారని చెప్పారు.