
భర్త వేధింపులకు నవవధువు బలి
► కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య
► చికిత్సపొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి
► మూడు నెలల క్రితమే ఒక్కటయ్యారు!
నర్వ : వేదమంత్రాలు, పంచభూతాల సాక్షిగా తాళికట్టిన భర్త వాటిని మరిచాడు. అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలతో భార్యను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సపొందుతూ శనివారం కన్నుమూసింది. నర్వ ట్రెయినీ ఎస్‌ఐ.రాజు కథనం ప్ర కారం ఆ వివరాలు... తల్లిదండ్రులు చనిపోవడంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన కమ్మరి గోవిందమ్మ(25), తన ఇద్దరి తమ్ముళ్లతో కలిసి మక్తల్ మండలం పంచదేవ్‌పాడ్‌లో ఉంటున్న మేనమామలు భగవంతాచారి, బాల్‌రాం, బాలస్వామిల వద్దకు సుమారు పదేళ్లక్రితం వచ్చింది. మొదటి వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోకుండా వదిలిపెట్టి వెళ్లడంతో తిరిగి మేనమామల వద్దకు చేరింది. అలాగే వదిలేయడం ఇష్టంలేని వారు ఆమెకు ఈఏడాది ఏప్రిల్‌లో నర్వ మండలం జిన్నారం గ్రామానికి చెందిన రాఘవేంద్రచారితో రెండో వివాహం చేశారు. ఇతనికి కూడా ఇది రెండో వివాహం.
మొద టి భార్య మృతిచెందిన విషయంలో 8ఏళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ఆ వ్యవహారం కోర్టులో ఉండగానే గోవిందమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె పుట్టింటివారితో ఎక్కువగా మాట్లాడుతుందని, అక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయేమోననే అనుమానంతో వేధించేవాడని ఎస్‌ఐ తెలిపారు. నిత్యం వీటిని భరించలేక గోవిందమ్మ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నర్వ ట్రెయినీ ఎస్‌ఐ.రాజు తెలిపారు.