![స్టార్టప్స్‌కు రాజధానిగా హైదరాబాద్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51444159153_625x300.jpg.webp?itok=MUwnsqtS)
స్టార్టప్స్‌కు రాజధానిగా హైదరాబాద్
♦ టెక్నాలజీతో ప్రభుత్వ విభాగాల అనుసంధానం
♦ మైక్రోసాఫ్ట్ స్మార్ట్ సిటీస్ వర్క్‌షాప్‌లో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: యువతరం సరికొత్త ఆలోచనలకు, ఔత్సాహిక పరిశ్రమ (స్టార్టప్స్)లకు హైదరాబాద్ రాజధానిగా మారనుందని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ముందుకు వ చ్చే స్టార్టప్స్‌కు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసిన స్మార్ట్‌సిటీస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్మార్ట్ సిటీస్ సొల్యూషన్స్ అంశంపై స్టార్టప్స్ రూపొందించిన ‘యాక్సలరేట్ ఇండియా’ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో హైదరాబాద్ కూడా ఉందని, నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పరిష్కారమార్గాల కోసం స్టార్టప్స్ కృషిచేస్తున్నాయన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరిచి పౌరసేవలను సులువుగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు.
త్వరలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లెసైన్స్‌లు
రవాణ శాఖ, ట్రాఫిక్ విభాగాలను సమన్వయపరిచి వివిధ రకా ల వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్‌లు ఎలక్ట్రానిక్ విధానంలో అందించేలా చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో చేపట్టనున్న ఈ పెలైట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖల సమన్వయంతో ఇటీవల ప్రారంభించిన పల్లె సమగ్ర సేవాకేంద్రాలు గ్రామీణ ప్రజల ఆదరణను చూరగొన్నాయని, ఈ-హెల్త్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించడంతో పాటు వారి వివరాలను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు.
అలాగే నీటి సరఫరా, విద్యుత్, శాంతి భద్రతలు.. తదితర విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్మార్ట్ టెక్నాలజీస్ ద్వారా పరిష్కారాలను కనుక్కునేందుకు మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన స్టార్టప్స్ సదస్సు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు ఒకే రకమైన ఈ మెయిల్ ఐడీలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరింత సులువుగా ప్రజలకు చేర్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు స్టార్టప్స్‌తో కలసి పరిష్కారాలను రూపొందిస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ నీరజ్ గిల్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ వెంచర్ల ద్వారా స్టార్టప్స్‌కు విస్తృతమైన అవకాశాలను అందించడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నామని చెప్పారు.