మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది
విలేకర్ల ఎదుట బోరున విలపించిన జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్
గుంటూరు(కొరిటెపాడు): సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణి అవలంబిస్తున్నారని, తాను చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే.. మీ అంతు చూస్తాను అం టూ బెదిరించారని, తన మనుషులను ఇంటి కి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నా రంటూ విలేకరుల ఎదుట బోరున విలపించారు.
స్థానిక జిల్లా పరిషత్ కాంపౌం డ్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాకుమాను మండలం గరికపాడులో జరిగిన చంద్రన్న రుణ ఉపశమన పత్రాల పంపిణీ సభలో తమపై రాళ్లదాడి చేయాలంటూ మంత్రి రావెల తన అనుచరులను పురిగొల్పారని ఆరోపించారు. తన సొంత మండలం కాకుమానులో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సైతం తనకు సమాచారం తెలియనీయవద్దని, ఆహ్వానించవద్దని అధికారులు, పార్టీ నాయకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తన కుటుంబానికి ప్రాణహాని వుందని రూరల్ ఎస్పీ కె.నారాయణనాయక్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు.
చలి చీమలను చంపాలన్నా భయపడతా!: రావెల
చలి చీమలను చంపాలన్నా తాను భయపడతానని, అలాంటిది కన్న కూతురు లాంటి జెడ్పీ చైర్‌పర్సన్ జానీ మూన్ కు హాని తలపెడతాననడం హాస్యాస్పదంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పుడు మాటలు వల్లే తనపై జానీమూన్ ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తోందన్నారు.