ఉక్కు పరిశ్రమపై అసెంబ్లీలో చర్చిస్తా
కమలాపురం అర్బన్:
జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనపై అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సీపీఐ ఏరియా కార్యదర్శి, మండల కార్యదర్శి చంద్ర, సుబ్బరాయుడు ఆయనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై
వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్సార్ జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రాష్ట్రం విడిపోయి రెండేళ్లవుతున్నా ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ చర్చించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జిల్లా వాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే విషయంలో వైఎస్సార్‌సీపీ ముందుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సీఎస్ నారాయణరెడ్డి, ఎన్‌సీ పుల్లారెడ్డి, ఎంపీటీసీ ఇర్ఫాన్‌బాషా, సుమీత్రా రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.