అడ్డా నాదే
అడ్డా నాదే
Published Wed, Jul 5 2017 9:42 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
– నా ఇలాకాలో ఇతరుల మద్యం షాపులను సహించను
– ఎక్సైజ్ అధికారులకు అధికార పార్టీ ‘నేత’ల హుకూం
– 5 నియోజకవర్గాల్లో 50కి పైగా దుకాణాలకు నాయకుల సెగ
కర్నూలు : నేను మోనార్క్... నా ఇలాకాలో ఇతరులు మద్యం షాపులను ఏర్పాటు చేస్తే సహించను... వారి లైసెన్సులను రద్దు చేయండి.. అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఎక్సైజ్ అధికారులకు ఫోన్‌లో హుకూం జారీ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశమయ్యింది. కర్నూలు శివారులోని మాసమసీదు సమీపంలో సుంకేసుల రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుకు అలంపూర్‌కు చెందిన వ్యక్తికి అధికారులు లైసెన్సు జారీ చేశారు. దుకాణం ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికార పార్టీ నేత హుకూం జారీ చేశాడు. ఆ దుకాణం రద్దుకు ఎక్సైజ్ అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే మండల పరిధిలోని సుంకేసుల మద్యం దుకాణాన్ని లక్కీడిప్‌లో ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడు దక్కించుకున్నాడు. అక్కడ కూడా తన అనుచరులే మద్యం దుకాణం నిర్వహిస్తారు. మరో ప్రాంతం వారిని అనుమతించేది లేదంటూ సదరు నాయకుడు దుకాణం ఏర్పాటును అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ లైసెన్స్‌దారుడు అక్కడ దుకాణం ఏర్పాటు చేసుకోలేక అవస్థలు పడుతున్నాడు. నాయకుడిని ఎదిరించి దుకాణం పెట్టుకోలేక గార్గేయపురంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు అడ్డుకున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 15 దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. అందులో ఎమ్మెల్యే అనుచరులు 9, ఇతరులు 6 దుకాణాలు దక్కించుకున్నారు. అయితే ఇతరుల దుకాణాలను ఏర్పాటు కానివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఆదోని, పత్తికొండ, నందికొట్కూరు, కోడుమూరు ప్రాంతాల్లో కూడా అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలతో ఇదే తరహాలో ఎక్సైజ్ అధికారులపై నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ముందు నుయ్యి... వెనక గొయ్యి...
జిల్లాలో మద్యం వ్యాపారుల పరిస్థితి ముందు నుయ్యి... వెనక గొయ్యి... అన్న చందంగా మారింది. మద్యం దుకాణాలను ప్రారంభించేందుకు కొందరికి ధైర్యం చాలడం లేదు. మహిళలు, ప్రజాసంఘాల ఆందోళనలు ఒకవైపు.. అధికార పార్టీ నాయకుల బెదిరింపులు మరోవైపు. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో సుమారు 50 దుకాణాలకు ఈ పరిస్థితి ఏర్పడింది. షాపుల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వకుండా అధికార పార్టీలోని వైరి వర్గాలే అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అటు మద్యం వ్యాపారులు... ఇటు ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు కూడా ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో దుకాణాలు ప్రారంభించడానికి జంకుతున్నారు. కొత్తగా షాపులు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నాయకులు నా సామ్రాజ్యంలో దుకాణం పెట్టొద్దంటూ హెచ్చరిస్తుండటంతో ఎక్కడ ప్రారంభించాలని ఆలోచనలో పడ్డారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోటీ పడి లక్కీడిప్‌లో దుకాణాలను దక్కించుకున్నారు. తీరా వాటిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా నేతల జోక్యం తలనొప్పిగా మారింది.
Advertisement
Advertisement