ఆదర్శభక్తుడు.. జేత్యానాయక్‌ | ideal devotive jetya naik | Sakshi
Sakshi News home page

ఆదర్శభక్తుడు.. జేత్యానాయక్‌

Published Sat, Aug 6 2016 12:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

ఆదర్శభక్తుడు.. జేత్యానాయక్‌

ఆదర్శభక్తుడు.. జేత్యానాయక్‌

► ఆరుదశాబ్దాలుగా నృసింహుడి సేవలో..
► నిత్యం స్వామివారికి ఆరెపత్రాలు సమర్పిస్తున్న ఆజన్మబ్రహ్మచారి

వేకువజామునే నాలుగు గంటలకు కృష్ణానదిలో స్నానమాచరించడం.. లక్ష్మీనారసింహుడి పూజకు ఉపయోగించే ఆరెపత్రాలను స్థానిక అటవీప్రాంతంలో కోసుకుని ఐదు గంటలకు దేవాలయంలో సమర్పించడం ఆ వృద్ధుడి దినచర్య. ఒకటి,రెండు రోజుల నుంచి కాదు ఏకంగా ఆరుదశాబ్దాలుగా స్వామివారి సేవలో తరిస్తూ ఆదర్శభక్తుడిగా పేరుగాంచారు..జేత్యానాయక్‌. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నిత్యపూజలు చేస్తున్న ఈ గిరిజనభక్తుడిపై సాక్షి ప్రత్యేక కథనం.
                                                                                                                         –మట్టపల్లి (మఠంపల్లి)

ప్రసిద్ధి పొందిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆరెచెట్టు పత్రాలతోనే(ఆకులు) పూజలు చేయడం ఆనవాయితీ. పూర్వకాలంలో తంగెడ మాచిరెడ్డి ప్రభువు స్వప్నంలో గోచరించి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఎన్నో రకాల ఫలపుష్పాలు లభిస్తున్నప్పటికీ ఆరెపత్రాలతో స్వామిని ప్రతినిత్యం తెల్లవారుజామున,మధ్యాహ్నం, సాయంకాలం సమయాల్లో విశేషంగా అర్చనాదులు నిర్వహిస్తున్నారు.  

పన్నేండేళ్ల ప్రాయంలో..
మట్టపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న రాంచంద్రాపురంతండాకు చెందిన పానుగోతు రామోజీ లక్ష్మీదేవి దంపతులకు ఐదుగురు  కుమారులు. వారిలో మూడో కుమారుడిగా సుమారు 80 ఏళ్ల క్రితం పానుగోతు జేత్యానాయక్‌ జన్మించాడు. పన్నెండేళ్ల ప్రాయంలోనే ఏదో తెలియని మైకంలో అటవీ ప్రాంతంలో ఉన్న మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాడు. ఆనాటి ప్రధాన అర్చకులు జోగాచార్యులు, వెంకటాచార్యులు జేత్యానాయక్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది అటవీప్రాంతం క్రూరమృగాలు సంచరిస్తుంటాయి.. ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి ఆలయానికి తాళం వేసి మట్టపల్లి గ్రామానికి వెళ్లారు.

క్రూరమృగాలకు భయపడకుండా..
చుట్టూ అటవీప్రాంతం.. క్రూరమృగాలు సంచరిస్తున్నా జేత్యానాయక్‌ భయపడకుండా స్వామివారి సన్నిధిలో రాత్రంతా గడిపాడు.. ఇదే తంతు నిత్యం కొనసాగుతుండడంతో ఓ రోజు ఆలయ ప్రధాన అర్చకులు జేత్యానాయక్‌ను చూశారు. నిత్యం స్వామి వారి ప్రసాదం మాత్రమే తీసుకొని ఆలయంలోనే ఉండటాన్ని గమనించి నీవు ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంటున్నావు అని ప్రశ్నించారు. దీంతో తనను ఆలయం నుంచి వెళ్లగొట్ట వద్దని తాను బతికినంత కాలం నర్సింహస్వామి సేవలోనే కొనసాగుతానని.. అవకాశం ఇవ్వాలని కోరాడు. దీంతో ఆలయ అర్చకులు, పాలకవర్గం, జేత్యానాయక్‌లోని స్వామి సేవా భావాన్ని కనిపెట్టి ఆలయంలో నివసించేందుకు అవకాశమిచ్చారు.

స్వామిని వదిలి రాలేనని..
జేత్యానాయక్‌ విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు ఆలయానికి వచ్చి తమతో రమ్మని కోరినప్పటికీ తాను నృసింహుని సేవ వదిలి రాలేనని, తనకు క్రూరమృగాలు, నరసింహస్వామి రెండు ఒకటేనని పలికాడు. ఆ నాటి నుంచి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ స్వామి సేవలోనే  కొనసాగుతున్నాడు. యుక్త వయసులో వివాహం చేసుకోవాలని బంధువులు, అర్చకులు, దేవస్థానపాలకవర్గం వారు కోరినప్పటికీ తాను ఆజన్మ బ్రహ్మచారిగానే ఉంటానని, తన స్వామి సేవకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దన్నాడు. దీంతో దేవస్థానం రెండు గదుల రేకుల కప్పుతో జేత్యానాయక్‌కు నివాసం ఏర్పరిచింది. ప్రస్తుతం 80 ఏళ్లు పైబడినప్పటికీ ఎలాంటి మానసిక, శారీరక రుగ్మతలు లేని జీవితాన్ని గడుపుతూ స్వామికి ప్రతినిత్యం పూజకు ఆరెపత్రాలు సమర్పిస్తున్నాడు. దేవస్థాన పరిసరప్రాంతాల్లో సంచరిస్తూ స్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ జీవిస్తున్నాడు జేత్యానాయక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement