dro
ఒంగోలు:
- కలెక్టర్ సుజాతశర్మ
డీఆర్వోగా పనిచేసి రిటైరైన నూర్‌బాషా విధి నిర్వహణలో పడిన తపన అందరికీ ఆదర్శం అని కలెక్టర్ సుజాతశర్మ అన్నారు. ఆదివారం స్థానిక రాంనగర్ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నూర్‌బాషాకు పదవీ విరమణ సన్మానసభ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ పదవీ విరమణ కార్యక్రమాన్ని జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మిత్రులు, ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజానీకం కూడా తరలి వచ్చారని, ఇందుకు ఆయన అందించిన సేవలే కారణమన్నారు. జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, జేసీ–2 ప్రకాష్‌కుమార్‌లు మాట్లాడుతూ నూర్‌బాషాను దగ్గర నుంచి తాము చూసిన దాని కన్నా ఆయన పని చేసిన ప్రాంతం నుంచి వచ్చిన జనం చెబుతున్న విషయాలు వింటుంటే ఎనలేని సంతోషం కలుగుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ సత్యన్నారాయణ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడుగు బాబూరావు తదితరులు మాట్లాడుతూ పేదవాడు నివసించేందుకు కనీసం జాగా అయినా చూపించాలనే ఉద్దేశంతో నూర్‌బాషా పనిచేశారన్నారు. రిటైర్డ్ డీఆర్‌వో మేకా రవీంద్రబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో శ్రీకాకుళంలో ఆయన ముందస్తుగా చెప్పిన సర్వే నూటికి నూరుపాళ్లు నిజమైందన్నారు. అనంతరం డీఆర్వోకు, ఆయన సతీమణికి సంయుక్తంగా ఘన సన్మానం నిర్వహించారు. సన్మానగ్రహీత, పదవీ విరమణ చేసిన నూర్‌బాషా ఖాశిం మాట్లాడుతూ తాను గుంటూరు జిల్లా వాసిని అయినప్పటికీ ఈ జిల్లాలో తొలుత తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించానని, చివరకు ప్రకాశం జిల్లాలోనే పదవీ విరమణ చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. విధి నిర్వహణలో తనకు అండదండలగా ఉంటూ అందరికీ కృతజ్ఞతలు ప్రకటించారు. రిటైర్డ్ అదనపు జేసీ నీలకంఠం, ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, జెడ్పీ సీఈవో టి.బాపిరెడ్డి, డీఎస్‌వో టి.వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ మురళి, రెవెన్యూ కాన్ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరశింహారావు , ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య పాల్గొన్నారు.