రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీడీపీ దొంగలు
రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీడీపీ దొంగలు
Published Tue, Nov 22 2016 6:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్లండి
ప్రారంభించిన వాటికే మళ్లీ ప్రారంభోత్సవాలా?
రైతు వ్యవసాయం వదిలేస్తే దేశం ఏమైపోతుంది
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి ధ్వజం
తణుకుః ఇసుక, మట్టిని య«థేచ్ఛగా దోపిడీ చేస్తూ రైతుల నుంచి ధాన్యం కమిషన్ రూపంలో రూ. కోట్లు దండుకుంటూ రాష్ట్రాన్ని టీడీపీ దొంగలు దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం తణుకులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడప గడపకూ వైఎస్సార్ పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు అడిగితే టిడిపి నాయకులను దొంగల్లాగ చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకు జవాబుదారీ తనంగా ఉంటూ ప్రతి ఇంటికీ తాము వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉంటే జనచైతన్యయాత్రల పేరుతో గ్రామాలు, వార్డుల్లో తిరుగుతున్నామంటూ ఎవరికి సమాధానం చెబుతున్నారని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలు కట్టవద్దని ఎన్నికలకు ముందు ఇంటింటికీ వచ్చి బొట్టు పెట్టి మరీ చెప్పారని ఇప్పుడు అడిగితే ముఖం చాటేస్తున్నారంటూ మహిళలు వాపోతున్నారన్నారు. తాము ఒక గ్రామంలో వారం పైబడి తిరుగుతుంటే జనచైతన్య యాత్రలంటూ రోజుకు రెండు గ్రామాలు, రెండు వార్డుల్లో పర్యటిస్తుండం ఎంత వరకు సమంజసమన్నారు. ఇలా తిరుగుతూ ఎవరింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రాచరిక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానిస్తే పార్టీనాయకులు మాత్రం తమ నాయకుడి మాటలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారన్నారు. అయితే ఇప్పుడు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వ్యవసాయం వేస్ట్... పరిశ్రమలు బెస్ట్... అంటూ వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. రైతులు కాడి వదిలేస్తే దేశం ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరిగి ప్రారంభోత్సవాలా..?
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. 1.44 కోట్లు మునిసిపల్ సాధారణ నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టిన స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ స్టేడియంను గతంలోనే ప్రారంభిస్తే ఇప్పుడు తామేదో ఘనకార్యం చేసినట్లు మరోసారి ప్రారంభోత్సవం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలతో ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎంపీ చిట్టూరి సుబ్బారావు చౌదరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అప్పట్లోనే కౌన్సిల్ తీర్మానం చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా మహాత్మాజ్యోతిరావు పూలే పేరుతో బీసీ కమ్యూనిటీ హాలు నిర్మిస్తే టిడిపి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భవనం కింద పేరు మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రస్తుతం రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేయడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారన్నారు. ఇంట్లో పెళ్లి జరిగితే రూ. 2.50 లక్షల వరకు వెసులుబాటు ఉందని చెబుతున్నా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు. నోట్లు రద్దు నేను రాసిన లేఖ వల్లనే ప్రధానమంత్రి చేశారని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రకటనలు చేయడాన్ని ఆక్షేపించారు. బహిరంగ సమావేశాలకు డ్వాక్రా మహిళలను తరలించే నాయకులు వారి అడిగిన ప్రశ్నలకు మాత్రం బదులివ్వకుండా తప్పించుకుంటున్నారన్నారు. మహిళలను నిర్భంధించి మరీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లులో జిల్లాలో రూ. 48 కోట్లు అవినీతి జరిగిందని సాక్షాత్తూ జిల్లా జడ్పీ ఛైర్మన్ పేర్కొంటూ విచారణ చేయాలని డిమాండ్ చేయడం టిడిపి నాయకుల అనివీతికి నిదర్శనమన్నారు. ఈ పరిస్థితుల్లో దొంగలు ఎవరు..? మీ పార్టీ నాయకులా... మా పార్టీ నాయకులా... అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ములగాల శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు ఎస్‌ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాస్, నామకులు నార్గన సత్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, బూసి వినీత, బోడపాటి వీర్రాజు, కర్రి కాశీరెడ్డి, వి.సీతారాం, దాసి రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement