’గుట్ట’కాయ స్వాహా
’గుట్ట’కాయ స్వాహా
Published Sat, Feb 4 2017 10:09 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
తాడిపూడి కాలువ గట్లను తవ్వుకుపోతున్న మట్టి మాఫియా
మంత్రిగారి పేరు.. వ్యాపారం జోరు
టీడీపీ నేతల హస్తం
తాడేపల్లిగూడెం రూరల్ :
తాడిపూడి కాలువ గట్లను మట్టి మాఫియా కొల్లగొడుతోంది. తాడిచెట్టు ఎత్తున వేసిన గట్లను ఎక్కడికక్కడ తవ్వేస్తూ పెద్దఎత్తున చీకటి వ్యాపారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంజగ్గన్నపేట మధ్య సుమారు 5 కిలోమీటర్ల పొడవు తాడిపూడి కాలువ ఉండగా.. ఎక్కడికక్కడ పొక్లెయిన్లతో తవ్వేస్తూ లారీలో, ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్‌లోని చెరువును రైతు బజార్ ఏర్పాటు నిమిత్తం పూడ్చారు. ఈ పనుల కోసం ఇక్కడి గట్ల నుంచి మట్టి తవ్వి తరలించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచనల మేరకు అప్పట్లో ఈ పనులు చేశారు. చెరువు పూడిక పూర్తయినా కొందరు అక్రమార్కులు ఇప్పటికే అవే పనుల పేరుతో మట్టి తవ్వకాలు సాగిస్తూ చీకటి దందా నడుపుతున్నారు. అదేమని అడిగితే.. మంత్రి పేరు చెబుతున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే, ’చెరువు పూడిక కోసం మంత్రిగారు గట్లను తవ్వించేస్తే తప్పులేదు గాని.. మేం తవ్వుకెళితే తప్పు పడతారెందుకు’ అని దబాయిస్తున్నారు. గట్టు వెంబడి మట్టితోపాటు అడ్డంగా తవ్వేస్తూ గట్లను పూర్తిగా మాయం చేసేస్తున్నారు.
ట్రక్కు మట్టి రూ.2,500
ట్రక్కు మట్టిని రూ.2,500, లారీ మట్టిని రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. రవాణా చేసే దూరాన్ని బట్టి ధరలను పెంచుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా గట్లను తవ్వేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇక్కడ తాడిపూడి కాలువ గట్లు ఉండేవని చెప్పడానికి ఆనవాళ్లు సైతం మిగిలే అవకాశం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గట్లను యథేచ్ఛగా తవ్వేయడం వల్ల వర్షాకాలంలో తాడిపూడి కాలువలోకి వచ్చే ఎర్రకాలువ నీరు పంట పొలాలను ముంచేసే ప్రమాదం ఉంది. మండలంలో చాలాచోట్ల గట్ల తవ్వకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాల పరిధిలో రోడ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణానికి పూడిక, రియల్ ఎస్టేట్ భూముల పూడిక కోసం ప్రస్తుతం తాడిపూడి కాలువ గట్ల మట్టినే వినియోగిస్తున్నారు. ఈ దందా వెనుక కొందరు టీడీపీ నేతల హస్తముందనే ప్రచారం సాగుతోంది.
Advertisement
Advertisement