tadipudi
-
’గుట్ట’కాయ స్వాహా
తాడిపూడి కాలువ గట్లను తవ్వుకుపోతున్న మట్టి మాఫియా మంత్రిగారి పేరు.. వ్యాపారం జోరు టీడీపీ నేతల హస్తం తాడేపల్లిగూడెం రూరల్ : తాడిపూడి కాలువ గట్లను మట్టి మాఫియా కొల్లగొడుతోంది. తాడిచెట్టు ఎత్తున వేసిన గట్లను ఎక్కడికక్కడ తవ్వేస్తూ పెద్దఎత్తున చీకటి వ్యాపారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంజగ్గన్నపేట మధ్య సుమారు 5 కిలోమీటర్ల పొడవు తాడిపూడి కాలువ ఉండగా.. ఎక్కడికక్కడ పొక్లెయిన్లతో తవ్వేస్తూ లారీలో, ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్లోని చెరువును రైతు బజార్ ఏర్పాటు నిమిత్తం పూడ్చారు. ఈ పనుల కోసం ఇక్కడి గట్ల నుంచి మట్టి తవ్వి తరలించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచనల మేరకు అప్పట్లో ఈ పనులు చేశారు. చెరువు పూడిక పూర్తయినా కొందరు అక్రమార్కులు ఇప్పటికే అవే పనుల పేరుతో మట్టి తవ్వకాలు సాగిస్తూ చీకటి దందా నడుపుతున్నారు. అదేమని అడిగితే.. మంత్రి పేరు చెబుతున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే, ’చెరువు పూడిక కోసం మంత్రిగారు గట్లను తవ్వించేస్తే తప్పులేదు గాని.. మేం తవ్వుకెళితే తప్పు పడతారెందుకు’ అని దబాయిస్తున్నారు. గట్టు వెంబడి మట్టితోపాటు అడ్డంగా తవ్వేస్తూ గట్లను పూర్తిగా మాయం చేసేస్తున్నారు. ట్రక్కు మట్టి రూ.2,500 ట్రక్కు మట్టిని రూ.2,500, లారీ మట్టిని రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. రవాణా చేసే దూరాన్ని బట్టి ధరలను పెంచుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా గట్లను తవ్వేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇక్కడ తాడిపూడి కాలువ గట్లు ఉండేవని చెప్పడానికి ఆనవాళ్లు సైతం మిగిలే అవకాశం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గట్లను యథేచ్ఛగా తవ్వేయడం వల్ల వర్షాకాలంలో తాడిపూడి కాలువలోకి వచ్చే ఎర్రకాలువ నీరు పంట పొలాలను ముంచేసే ప్రమాదం ఉంది. మండలంలో చాలాచోట్ల గట్ల తవ్వకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాల పరిధిలో రోడ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణానికి పూడిక, రియల్ ఎస్టేట్ భూముల పూడిక కోసం ప్రస్తుతం తాడిపూడి కాలువ గట్ల మట్టినే వినియోగిస్తున్నారు. ఈ దందా వెనుక కొందరు టీడీపీ నేతల హస్తముందనే ప్రచారం సాగుతోంది. -
గట్టు.. ఇదీ లోగుట్టు
ఎడాపెడా అక్రమాలకు తెగబడటం.. ప్రజాధనాన్ని లూటీ చేయడం వారి దినచర్య. ఆనక అధికారం అండతో పాపాల్ని కడిగేసుకోవడం వారికి పరిపాటి. తాడిపూడి, పోలవరం కుడికాలువ వెంబడి ఇదే తంతు నడుస్తోంది. ప్రజాప్రతినిధులు.. అధికారుల అండతో నిత్యం భారీఎత్తున ఎర్ర కంకరను తవ్వుకుపోతున్నారు. దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా ఇక్కడ కంకర మాఫియా బుసలు కొడుతోంది. ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు గండిపడిన వైనం ఈ వాస్తవాల్ని మరోసారి బహిర్గతం చేసింది. ఉంగుటూరు : తాడిపూడి కాలువకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద రెండోసారి గండి పడటానికి అక్రమార్కులే కారణమనే విషయం మరోసారి వెల్లడైంది. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో చీకటి మాటున సాగిస్తున్న గ్రావెల్ తవ్వకాల వల్లే కాలువ గట్టు తెగిపోయింది. కాలువ గట్లతోపాటు, గట్ల పక్కన గల ఎర్రకంకరను తవ్వి తరలించుకుపోతున్నారు. ఇదే ప్రాంతంలో 2013లోనూ గండి పడింది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమ తవ్వకాలను నిలువరించే ప్రయత్నం చేయకపోగా.. కంకర మాఫియాకు వంతపాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆగని తవ్వకాలు పోలవరం, తాడిపూడి కాలువ గట్లవెంబడి రాత్రి వేళల్లో పొక్లెయిన్ల సాయంతో కంకర తవ్వి నిత్యం ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. దీనిని దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఎవరికి అందాల్సిన సొమ్ము వారికి అందుతుం డటంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టవేసే నాథుడు కనబడటం లేదు. ఇదే విషయమై అనేకసార్లు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, మీకోసం కార్యక్రమాల్లో ప్రజలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదం టే కంకర మాఫియా ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కాలువ గట్లపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానైనా లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. అక్రమ తవ్వకాలు సాగిపోతుంటే పట్టించుకోరేం అని అడిగితే ‘మాకు పిల్లాపాపలు ఉన్నారు. మా జీవితాలను గట్ల కోసం పణంగా పెట్టలేం’ అని కొందరు అధికారులు చెబుతున్నారంటే.. మాఫియా ఎంతగా పేట్రేగిపోతోందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. 10 అడుగులపైనే గండి గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు 10 అడుగుల పైనే గండి పండింది. 2013లోనూ ఇక్కడే గండిపడగా, వరద నీరు తిమ్మాయపాలెం గ్రామంలోని కోడేరు చెరువులో చేరింది. అనంతరం చెరువుకు గండిపడి తిమ్మాయపాలెం నూతన కాలనీ రోడ్డు ముంపునకు గురైంది. సోమవారం వేకువజామున తిరిగి అదే ప్రాం తంలో గండిపడగా తిమ్మాయపాలెం ముంపుబారిన పడింది. గతంలో గండిపడినా అధికారులు పూర్తిస్థారుులో చర్యలు తీసుకోలేదు. దీంతో అదే ప్రాంతంలో రెండోసారి గండి పడిందని రైతులు చెబుతున్నారు. గ్రావెల్‌ను తవ్వేస్తుండటంతో ఉంగుటూరు మండలం పరిధిలో తాడిపూడి, పోలవరం కుడికాలువ గట్లు బలహీనమయ్యూరుు. ఒక్కరోజు మాత్రమే వర్షం కురవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. వర్షాలు ఇలాగే కొనసాగితే ఊళ్లు, పంటలు మునగటం ఖాయమని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతెన నిర్మించాలి ఏటా భారీ వర్షాల వల్ల వరద నీరు రావటంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. 2013 భారీ వర్షాలకు ఇదే ప్రాంతం వద్ద గండి పడింది. అరుునా సరైన చర్యలు తీసుకోలేదు. సోమవారం మరోసారి గండి పడటంతో 60 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తిమ్మయ్యపాలెం వద్ద వంతెన నిర్మించాలి. - మారిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాంక్రీట్ లైనింగ్ వేయాలని కోరాం తాడిపూడి కాలువ గట్లను పటిష్టత కోసం కాంక్రీట్ లైనింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాం. గట్ల పటిష్టానికి చర్యలు తీసుకుంటాం. తవ్విన గ్రావెల్‌ను గట్లపైనే ఉంచేలా చూడాలని అధికారులను కోరతాం. - గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే -
తాడిపూడి ‘కృష్ణా’ర్పణం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం జాతీయ హోదా గల బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టును సర్కారు పక్కన పెట్టేసింది. రాయలసీమ పేరుచెప్పి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించేందుకు యత్నిస్తున్న ప్రభుత్వం జిల్లా రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ మరో కుట్రకు తెరలేపింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు కాబట్టి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించుకుపోతామంటోంది. ఇందుకు మెట్ట ప్రాంతంలోని 14 మండలాల రైతులను సమిధలుగా మారుస్తోంది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేందుకు గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువను పోలవరం కుడికాలువతో అనుసంధానిస్తూ పైప్ కల్వర్టు నిర్మిస్తోంది. మన జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2,06,600 ఎకరాలకు సాగునీరు, 135 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. కృష్ణా డెల్టాకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టికొడుతున్న సర్కారు తీరుపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ప్రభుత్వ జాప్యం తాడిపూడి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. సర్కారు కుట్రపూరిత నిర్ణయంతో తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కృష్ణా నదికి అడ్డదారిలో గోదావరి జలాలను తరలించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతోంది. - కొవ్వూరు ‘పట్టిసీమ’ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించని ప్రభుత్వం ఏదో రకంగా గోదావరి నీటిని కృష్ణానదికి తరలించేందుకు పూనుకుంది. జిల్లాలో ఏడు నియోజవర్గాల పరిధిలో 14 మండలాలకు చెందిన మెట్టరైతుల ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టింది. సాగునీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిల్చింది. వెయ్యి క్యూసెక్కులు తరలింపు లక్ష్యం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కాలువకి 600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇక్కడి నుంచి 900 నుంచి వెయ్యి క్యూసెక్కులు నీరు తరలించాలని ప్రభుత్వం పథకం రచించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం కాకిలెక్కలు చెబుతూ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాడిపూడి పథకం నిర్దేశించిన 2,06,600 ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 1,397 క్యూసెక్కులు (12.15 టీఎంసీలు) అవసరం. ఒక క్యూసెక్కు నీటితో 147.86 ఎకరాలకు నీరు అందించే విధంగా ఈపథకం రూపొందించారు. తాడిపూడి కాలువ నుంచి 600 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలువకు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. వీటితో 88,720 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం 797 క్యూసెక్కుల నీటిని తాడిపూడి ఆయకట్టుకు అధికారులు లెక్కలు చూపుతున్నారు.1,17,851 ఎకరాలకు నీరు ఇస్తున్నట్టు లెక్కతేల్చారు. వాస్తవానికి అసంపూర్తి పనుల కారణంగా కేవలం 70 వేల ఎకరాలకే నీరందిస్తున్నారు. తాడిపూడి పథకం రూపకల్పన ప్రకారం 1,397 క్యూసెక్కుల్లో మూడోవంతు నీరు ప్రస్తుతం ఆయకట్టుకి సరిపోతుంది. 900 క్యూసెక్కుల నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని తరలించడమే ప్రభుత్వ వ్యూహమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. భూసేకరణలో జాప్యం తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలు, ఉప కాలువలు, పంపిణీ కాలువలకు సంబంధించి ఇంకా 720 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.పది కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.పోలవరం కుడి ప్రధాన కాలువ భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం తాడిపూడి భూసేకరణను మాత్రం పక్కన పెట్టింది. భూసేకరణ, చెట్ల పరిహారం కలిపి సుమారు రూ.100 కోట్లు అవసరమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమజ తెలిపారు. అదనంగా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 అక్టోబర్ 25న లాంఛనంగా తాడిపూడి పథకం నిర్మాణ పనులు ప్రారంభించారు.అప్పట్లోనే 40 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 2009 నుంచి జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల వరకు నీరందించారు.కొందరు కోర్టులను ఆశ్రయించడం, భూసేకరణ పెండింగ్ ఉండడంతో పనులు ముందుకు సాగలేదు.వైఎస్సార్ మరణానంతరం పథకం పను లు పడకేశాయి.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదు. తాడిపూడికి గండి కొట్టడం సమంజసం కాదు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మెట్ట రైతులకు సాగు నీరు అందించేందుకు తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చంద్రబాబు సర్కారు పనులు పూర్తి చేయకపోవడం వల్ల పంటపొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాలకు తాడిపూడి నీరు తరలించేందుకు కుట్ర చేయడం దారుణం.పట్టీసీమను పూర్తి చేయకుండా తాడిపూడి నీరుకు గండి కొట్టడం వెంటనే మానుకోవాలి. -బాలం సుబ్బారావు, రైతు, పోచవరం నీరు సక్రమంగా అందడం లేదు తాడిపూడి కాలువ పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో పంటలకు నీరు అందడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ పూర్తి కాలేదన్న సాకుతో తాడిపూడి నీటిని కృష్ణాజిల్లాకు తరలించడం ద్వారా ఆయకట్టు రైతులంతా తీవ్రంగా నష్టపోతారు. - గుళ్లపూడి శివరామకృష్ణ, రైతు, పోచవరం దగా చేస్తున్న చంద్రబాబు పట్టిసీమ పేరుతో రెండు జిల్లాల రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నదులను అనుసంధానం చేస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నాటికి ఒక్క చుక్క నీటిని కూడా తరలించే అవకాశం లేదు. తాడిపూడి పంపింగ్ పథకం నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమగోదావరిలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని లేకుండా చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నీటిని తరలించటం అంతా బూటకమే... - కొవ్వూరి త్రినాథరెడ్డి, నీటి సంఘాల రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రామచంద్రపురం(తూ.గో.) డెల్టాలో రబీ సాగు ఉండదు పట్టిసీమ వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలో రబీసాగు సగానికి పైగా తుడుచుపెట్టుకు పోతుంది. తూర్పుగోదావరిలో శివారు ప్రాంతాలకు సాగునీరందదు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉప్పునీటి ముంచెత్తడం వల్ల 10వేల ఎకరాల్లో సాగులేకుండా పోయింది. తూర్పు కంటే పశ్చిమగోదావరి జిల్లా మెరకప్రాంతం కావడంతో సగానికి పైగా సాగు ఉండదు. - ముత్యాల జమ్మి, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి, అంబాజీపేట(తూ.గో.) -
ఉత్తిపోతలు
ఏలూరు : మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 2.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. అయితే, కేవలం 1.30 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. 700 ఎకరాల భూసేకరణ ప్రధాన సమస్యగా ఉండటంతో 70వేల ఎకరాలకు నీరందించే విషయంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. భూములివ్వాల్సిన రైతుల నష్టపరిహారం పెంచాలని కోరగా, ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడం లేదు. ఫలితంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఇదిలావుంటే.. ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని 7వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 2003లో శంకుస్థాపన చేసిన గిరమ్మ ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. పుష్కర కాలమైనా పనులు పూర్తి కాలేదు. దీనికి రూ.8 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరందించలేని దుస్థితి నెల కొంది. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలం వెంకటాపురం, తూర్పుయడవల్లి గ్రామాలకు గిరమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరివ్వాలి. కామవరపుకోటలో భూమిలో పైప్లైన్లు వేశారు. దొరసానిపాడులోనూ అదేవిధంగా పైప్లైన్లు వేయాలని ఇక్కడి రైతులిద్దరు కోర్టును ఆశ్రయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తికాగా, 2010 ఆగస్టులో ట్రయల్ రన్ వేసి వదిలేశారు. కాలువలు తవ్వి, భూమిలో పైప్లైన్లు వేస్తే ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు. చిక్కుల నడుమ చింతలపూడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట మండలాల్లో 230 గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీని నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,701 కోట్ల నిధులు కేటాయించారు. 2008 అక్టోబర్ 30న ఈ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకానికి 2,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 500 ఎకరాలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. దీనికోసం పట్టిసీమ వద్ద 25,560 హార్స్పవర్ గల పంప్‌హౌస్, కాలువల తవ్వకం పనులు కొంతమేర చేపట్టారు. 12 టీఎంసీల నీటిని 28 కిలోమీటర్ల మేర దిగువకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రధానమైన పనులేమీ ప్రారంభించలేదు. అక్కడక్కడా 40,588 ఎకరాలకు.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 28 చిన్నపాటి ఎత్తిపోతల పథకాల ద్వారా 40,588 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇందులో బుట్టాయగూడెం మండలంలో గాడిదబోరు-1, గాడిదబోరు-2 పంపుహౌస్‌ల నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. వీటితోపాటు శిరగాలపల్లి-1, శిరగాలపల్లి-2, మైప, పిప్పర, కేశవరం, కొప్పర్రు గ్రామాల్లో చిన్నపాటి ఎత్తిపోతల పథకాలతో 16,128 ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచి నీరు అందించాలని నిర్ణయించారు.