పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం జాతీయ హోదా గల బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టును సర్కారు పక్కన పెట్టేసింది. రాయలసీమ పేరుచెప్పి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించేందుకు యత్నిస్తున్న ప్రభుత్వం జిల్లా రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ మరో కుట్రకు తెరలేపింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు కాబట్టి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించుకుపోతామంటోంది. ఇందుకు మెట్ట ప్రాంతంలోని 14 మండలాల రైతులను సమిధలుగా మారుస్తోంది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేందుకు గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువను పోలవరం కుడికాలువతో అనుసంధానిస్తూ పైప్ కల్వర్టు నిర్మిస్తోంది. మన జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2,06,600 ఎకరాలకు సాగునీరు, 135 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. కృష్ణా డెల్టాకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టికొడుతున్న సర్కారు తీరుపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ప్రభుత్వ జాప్యం తాడిపూడి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. సర్కారు కుట్రపూరిత నిర్ణయంతో తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కృష్ణా నదికి అడ్డదారిలో గోదావరి జలాలను తరలించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతోంది.
- కొవ్వూరు
‘పట్టిసీమ’ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించని ప్రభుత్వం ఏదో రకంగా గోదావరి నీటిని కృష్ణానదికి తరలించేందుకు పూనుకుంది. జిల్లాలో ఏడు నియోజవర్గాల పరిధిలో 14 మండలాలకు చెందిన మెట్టరైతుల ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టింది. సాగునీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిల్చింది.
వెయ్యి క్యూసెక్కులు తరలింపు లక్ష్యం
తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కాలువకి 600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇక్కడి నుంచి 900 నుంచి వెయ్యి క్యూసెక్కులు నీరు తరలించాలని ప్రభుత్వం పథకం రచించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం కాకిలెక్కలు చెబుతూ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాడిపూడి పథకం నిర్దేశించిన 2,06,600 ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 1,397 క్యూసెక్కులు (12.15 టీఎంసీలు) అవసరం. ఒక క్యూసెక్కు నీటితో 147.86 ఎకరాలకు నీరు అందించే విధంగా ఈపథకం రూపొందించారు. తాడిపూడి కాలువ నుంచి 600 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలువకు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. వీటితో 88,720 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం 797 క్యూసెక్కుల నీటిని తాడిపూడి ఆయకట్టుకు అధికారులు లెక్కలు చూపుతున్నారు.1,17,851 ఎకరాలకు నీరు ఇస్తున్నట్టు లెక్కతేల్చారు.
వాస్తవానికి అసంపూర్తి పనుల కారణంగా కేవలం 70 వేల ఎకరాలకే నీరందిస్తున్నారు. తాడిపూడి పథకం రూపకల్పన ప్రకారం 1,397 క్యూసెక్కుల్లో మూడోవంతు నీరు ప్రస్తుతం ఆయకట్టుకి సరిపోతుంది. 900 క్యూసెక్కుల నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని తరలించడమే ప్రభుత్వ వ్యూహమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
భూసేకరణలో జాప్యం
తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలు, ఉప కాలువలు, పంపిణీ కాలువలకు సంబంధించి ఇంకా 720 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.పది కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.పోలవరం కుడి ప్రధాన కాలువ భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం తాడిపూడి భూసేకరణను మాత్రం పక్కన పెట్టింది. భూసేకరణ, చెట్ల పరిహారం కలిపి సుమారు రూ.100 కోట్లు అవసరమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమజ తెలిపారు.
అదనంగా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 అక్టోబర్ 25న లాంఛనంగా తాడిపూడి పథకం నిర్మాణ పనులు ప్రారంభించారు.అప్పట్లోనే 40 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 2009 నుంచి జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల వరకు నీరందించారు.కొందరు కోర్టులను ఆశ్రయించడం, భూసేకరణ పెండింగ్ ఉండడంతో పనులు ముందుకు సాగలేదు.వైఎస్సార్ మరణానంతరం పథకం పను లు పడకేశాయి.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదు.
తాడిపూడికి గండి కొట్టడం సమంజసం కాదు
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మెట్ట రైతులకు సాగు నీరు అందించేందుకు తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చంద్రబాబు సర్కారు పనులు పూర్తి చేయకపోవడం వల్ల పంటపొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాలకు తాడిపూడి నీరు తరలించేందుకు కుట్ర చేయడం దారుణం.పట్టీసీమను పూర్తి చేయకుండా తాడిపూడి నీరుకు గండి కొట్టడం వెంటనే మానుకోవాలి.
-బాలం సుబ్బారావు, రైతు, పోచవరం
నీరు సక్రమంగా అందడం లేదు
తాడిపూడి కాలువ పనులు
ఇంకా పూర్తి చేయకపోవడంతో పంటలకు నీరు అందడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ పూర్తి కాలేదన్న సాకుతో తాడిపూడి నీటిని కృష్ణాజిల్లాకు తరలించడం ద్వారా ఆయకట్టు రైతులంతా తీవ్రంగా నష్టపోతారు.
- గుళ్లపూడి శివరామకృష్ణ, రైతు, పోచవరం
దగా చేస్తున్న చంద్రబాబు
పట్టిసీమ పేరుతో రెండు జిల్లాల రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నదులను అనుసంధానం చేస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నాటికి ఒక్క చుక్క నీటిని కూడా తరలించే అవకాశం లేదు. తాడిపూడి పంపింగ్ పథకం నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమగోదావరిలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని లేకుండా చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నీటిని తరలించటం అంతా బూటకమే...
- కొవ్వూరి త్రినాథరెడ్డి, నీటి సంఘాల
రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రామచంద్రపురం(తూ.గో.)
డెల్టాలో రబీ సాగు ఉండదు
పట్టిసీమ వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలో రబీసాగు సగానికి పైగా తుడుచుపెట్టుకు పోతుంది. తూర్పుగోదావరిలో శివారు ప్రాంతాలకు సాగునీరందదు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉప్పునీటి ముంచెత్తడం వల్ల 10వేల ఎకరాల్లో సాగులేకుండా పోయింది. తూర్పు కంటే పశ్చిమగోదావరి జిల్లా మెరకప్రాంతం కావడంతో సగానికి పైగా సాగు ఉండదు.
- ముత్యాల జమ్మి, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి, అంబాజీపేట(తూ.గో.)
తాడిపూడి ‘కృష్ణా’ర్పణం
Published Thu, Aug 13 2015 1:39 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement