ఇన్నాళ్లకు గుర్తొచ్చె.. నిర్మాణ వ్యయానికి రెక్కలొచ్చె.. | thadi pudi lift irrigation scheme dealy | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు గుర్తొచ్చె.. నిర్మాణ వ్యయానికి రెక్కలొచ్చె..

Published Thu, Feb 8 2018 11:48 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

thadi pudi lift irrigation scheme dealy - Sakshi

తాడిపూడి ఎత్తిపోతల పథకం పంప్‌ల నుంచి విడుదలవుతున్న నీరు

కొవ్వూరు: తాడిపూడి ఎత్తిపోతల పథకంపై సర్కారు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోంది. కృష్ణా జిల్లాకు నీళ్లు తరలించడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం తాడిపూడిని విస్మరించింది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన ఈ పథకంను పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపయ్యింది. ఈ పథకం నిర్మాణ వ్యయం మొదట్లో రూ.467.70 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ వ్యయం కాస్తా రూ.885.53 కోట్లకు పెరిగింది. ఇటీవలే ప్రభుత్వం అదనపు అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సుమారు రూ.417.83 కోట్ల వ్యయం అదనంగా పెరిగింది.
చంద్రబాబు ప్రారంభించారు..

వైఎస్‌ పూర్తి చేశారు
2003 నవంబర్‌ 12న అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేశారు. 2007 అక్టోబర్‌ 25న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించారు. అయితే చివరి ఆయకట్టు వరకూ సాగునీరందించాలని చేపట్టిన భూ సేకరణలో సమస్యలు ఎదురయ్యాయి. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఈ పథకంపై కన్నెత్తి చూడకపోవడం విశేషం. 

అసంపూర్తి పనులు పూర్తయితే..
తాళ్లపూడి మండలంలోని తాడిపూడిలో ప్రారంభమైన ఈ ఎత్తిపోతల పథకం వల్ల తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల తదితర మండలాల్లోని 2,06,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది లక్ష్యం. వైఎస్‌ చలవ వల్ల ఈ పథకం ద్వారా ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 1,57,454 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వాస్తవానికి లక్ష ఎకరాలు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. తాడిపూడి వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి కాలువల ద్వారా సుమారు 74 కిలోమీటర్ల దూరంలోని నల్లజర్ల మండలంలోని పొలాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఇంకా మెయిన్‌ కెనాల్‌పై 154 స్ట్రక్చర్స్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీటిలో 141కి పూర్తి చేశారు.

31 పంపిణీ కాలువలు పూర్తి చేయాల్సి ఉండగా 29 పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా రెండు పంపిణీ కాలువలు తవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఐదు సబ్‌లిఫ్ట్‌లుంటే మొదటి సబ్‌ సబ్‌ లిఫ్ట్‌ పూర్తి చేశారు. 2, 3, 4, సబ్‌లిఫ్ట్‌లతో పాటు ఐదు సబ్‌లిఫ్ట్‌లో కొన్ని చోట్ల అసంపూర్తి పనులు ఉన్నాయి. మొత్తం మీద సుమారు 70 పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐదో సబ్‌లిఫ్ట్‌ ద్వారా 12,915 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా గత ఏడాది నాలుగు వేల ఎకరాలకు నీరు అందించారు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే తప్ప ఆయకట్టు అంతటికీ సాగునీరు అందే పరిస్థితి లేదు. 420 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీని నిమిత్తం రూ.80 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్వాకంతో అంచనా వ్యయం రెట్టింపు
ముడుపుల కోసం, పర్సంటేజీల కోసమే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించింది. తాడిపూడిని మూడున్నరేళ్లుగా విస్మరించింది. స్వయంగా చంద్రబాబే శంకుస్థాపన చేసిన పథకం ఇన్నాళ్లకు ఆయనకు గుర్తుకు రావడం శోఛనీయం. అసంపూర్తి పనులను అధికారంలోకి రాగానే పూర్తి చేసి ఉంటే అంచనా వ్యయం పెరిగేది కాదు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా అంచనా వ్యయం రెట్టింపైంది. ఇప్పటికైనా అసంపూర్తి పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకూ సాగునీరు అందించాలి. –తానేటి వనిత, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్, కొవ్వూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement