అక్రమాల ‘పుట్టి’!
- పట్టిసీమ ఎత్తిపోతల్లో అవినీతి ప్రవాహం
- కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును ‘లిఫ్ట్’ చేయడానికే...
- నిబంధనలకు విరుద్ధంగా 5 శాతానికి మించి టెండర్ వేయడానికి అవకాశమివ్వాలని నిర్ణయం
- జనవరి 20న మెమో జారీ.. మినహాయింపు పట్టిసీమకేనట
- ‘తమ’ కాంట్రాక్టర్లు మినహా ఎవరూ రాకుండా ఎత్తుగడ!
- 10 కంపెనీలు టెండర్లు దాఖలు చేయకపోవడంపై అనుమానాలు
- 21.9 శాతం ఎక్సెస్ కోట్ చేసి ఎల్.1గా నిలిచిన ఎంఇఐఎల్‌కు కాంట్రాక్టు కట్టబెట్టిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో అవినీతి ప్రవహిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును లిఫ్ట్ చేయడానికి ఈ స్కీమ్‌ను ప్రభుత్వ పెద్దలు వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నీటిని నిలువ చేయడానికి వీలులేని ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమిటని టీడీపీ మినహా పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నిలదీస్తున్నా.. ప్రభుత్వం పట్టుదలతో ముందుకెళ్లడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పైగా టెండర్లను పిలవడంలోనే గోల్‌మాల్‌కు వీలుగా నిబంధనలకు ‘రూపకల్పన’ చేశారు. తొలుత రూపొం దించిన టెండర్‌ను మార్చి రెండోసారి తమకు అనుకూల నిబంధనలతో తయారు చేశారు. భారీగా ముడుపులు చేతులు మారడం వల్లనే.. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నిబంధనలు మార్చారనే ఆరోపణలున్నాయి.
‘5 శాతం’ నిబంధనకు నీళ్లు
ఎర్న్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో టెండర్ విలువలో 5 శాతం కంటే ఎక్కువను అనుమతించరు. గతంలో 10 శాతం వరకు అదనంగా కోట్ చేయడానికి అవకాశం ఉన్నా, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత.. 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం లేదని జీవో తెచ్చారు. ఒకవేళ టెండర్‌లో పాల్గొన్న కాంట్రాక్టర్లందరూ.. 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేస్తే..పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.పట్టిసీమ టెండర్‌లో అందుకు విరుద్ధంగా జరిగింది. తొలుత సాధారణ నిబంధనలతో జనవరి 7న టెండర్ పిలిచారు. ఆ ప్రకటన జనవరి 9న ‘ఈనాడు’లో వచ్చింది. జనవరి 12 నుంచి షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమవుతుందని, 27న ముగుస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రీబిడ్ సమావేశాన్ని 19న నిర్వహిస్తామని తెలిపారు. 28న టెక్నికల్ బిడ్స్, 31న ప్రైస్ బిడ్స్ తెరుస్తామని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.సాధారణ నిబంధనల వల్ల తాము ‘ఆశించిన ప్రయోజనం’ దక్కదనే ఉద్దేశంతో టెండర్ నిబంధనలు మార్చాలని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇలా ‘5 శాతం’ మించకూడదనే నిబంధనను తుంగలో తొక్కేశారు.
అధిక ధరకు వీలుగా మెమో జారీ
అధిక ధరకు కోట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 20న మెమో (నం. 52/ప్రాజెక్ట్ 1.ఎ.2/2015)ను ప్రభుత్వం జారీ చేసింది. 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం ఉంటుందని, గడువులోగా పూర్తి చేస్తే 5 శాతానికి పైన కోట్ చేసిన మొత్తాన్ని నజరానాగా చెల్లిస్తామని మెమోలో పేర్కొన్నారు. ఈ మినహాయింపు కేవలం పట్టిసీమ ప్రాజెక్టుకే పరిమితమని, మిగతా ప్రాజెక్టులకు సాధారణ ఈసీపీ నిబంధనలే వర్తిస్తాయని పేర్కొన్నట్లు తెలిసిం ది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. అన్ని టెండర్లు, ప్రాజెక్టులకు అది వర్తించాలి.కేవలం ఈ ఎత్తిపోతల టెండర్లకే మినహాయింపు పరిమితంటూ నిర్ణయం తీసుకోవడానికి ‘అవినీతి’ ఒత్తిడే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. ‘5 శాతం కంటే అధికంగా కోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 శాతం పైన కోట్ చేసిన మొత్తాన్ని గడువులోగా పూర్తి చేసిన తర్వాతే చెల్లించాలి’ అనే సవరణలను టెండర్ నిబంధనలకు జోడించారు.
ప్రపంచంలో ఎక్కడా లేదు!
విచిత్రమైన విషయం ఏమిటంటే.. పని పూర్తి చేయడానికి టెండర్‌లో ఇచ్చిన గడువు ఏడాది కాలమే.ఆ సామర్థ్యం ఉన్న సంస్థలే అందులో పాల్గొంటాయి. అటువంటప్పుడు ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తే.. 5 శాతం పైన కోట్ చేసిన మొత్తాన్ని నజరానాగా ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికారులే అంటున్నారు. ఇలా 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత.. రెండో టెండర్ నోటీసు ప్రకటనను జనవరి 30న ‘ఈనాడు’లో ప్రకటించారు. అయితే సవరణల్లో ముఖ్యమైన అంశమైన ‘5 శాతం పరిమితి తొలగింపు’ విషయాన్ని ప్రకటనలో పేర్కొనకపోవడం గమనార్హం. కేవలం టెండర్ షెడ్యూళ్లలో మార్పునే ప్రకటనలో పేర్కొన్నారు.‘ఈనాడు’లో ప్రకటన వచ్చేసరికే షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. జనవరి 24 నుంచే షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమైంది. పత్రికల్లో నోటీసు వచ్చిన మరుసటి రోజే.. జనవరి 31న ప్రీబిడ్ సమావేశం ధవళేశ్వరంలో జరిగింది. అంటే.. తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్లు మినహా, మిగతా వారిని కట్టడి చేసేందుకే ఇలా ప్రకటన ఇచ్చారని అధికారులే చెబుతున్నారు. ప్రీబిడ్ సమావేశానికి మొత్తం 12 సంస్థలు రాగా కేవలం రెండు సంస్థలే టెండర్లు దాఖలు చేశాయి. 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం ఉన్నా.. మిగతావారు ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
తొలి టెండర్‌లో అసమగ్ర డాక్యుమెంట్
తొలి టెండర్ ముగింపు తేదీ జనవరి 27. ముగింపు తేదీ కంటే నాలుగు రోజుల ముందే.. అంటే జనవరి 24 నుంచే సవరించిన టెండర్ షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమైంది. తొలి టెండర్‌లో అసమగ్ర టెండర్ డాక్యుమెంట్‌ను ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఉంచారని అధికార వర్గాల సమాచారం. అందువల్ల తొలి విడతలో కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి అవకాశం లేకుండా పోయింది. తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు.. తొలి టెండర్‌లో ఎవరూ పాల్గొనకుండా ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొందనే ఆరోపణలున్నాయి. సవరణల తర్వాత.. అంతా అనుకున్న తీరుగానే జరిగే విధంగా పక్కాగా వ్యూహరచన జరిగిందని, తమతో అవగాహన ఉన్న కంపెనీకి కాంట్రాక్టు దక్కడానికి, తద్వారా కాంట్రాక్టర్ నుంచి కాసులు రాల్చుకోవడానికి అడ్డగోలుగా నిబంధనలు మార్చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
16.9 శాతం నజరానా
టెండర్ సవరణల తర్వాత 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం కల్పించినా.. ఇద్దరే కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. ఎంఇఐఎల్ (మెయిల్), ఎల్ అండ్ టీ టెండర్లు వేశాయి. ఎంఇఐఎల్ తక్కువ (21.9 శాతం ఎక్సెస్) కోట్ చేసి ఎల్1గా నిలిచింది. ఎల్1గా ఎంఇఐఎల్‌కు ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టింది. పట్టిసీమ పని విలువ రూ. 1,170.25 కోట్లు. ఎల్1గా నిలిచిన కంపెనీ కోట్ చేసిన ధర (21.9 శాతం ఎక్సెస్) ప్రకారం.. రూ. 1426.53 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే పని విలువ కంటే రూ.256.28 అధికంగా చెల్లించాలి. ప్రభుత్వం చెబుతున్న విధంగా 5 శాతంపైన ఉన్న 16.9 శాతం నజరానా విలువ.. రూ. 198 కోట్లు. కాంట్రాక్టర్ అనుకూల నిర్ణయం వల్ల ఖజానా మీద ఇలా అదనపు భారం పడుతుంది.ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి, సకాలంలో పూర్తి చేయకపోవడానికి తామే కారణమని ఏ కాంట్రాక్టర్ చెప్పరు. ప్రభుత్వం మీదకే తప్పును నెట్టేస్తారు. ఇచ్చిన గడువులోగా పూర్తి చేయకపోయినా మొత్తం సొమ్ము చెల్లించాల్సిందేనని అడుగుతారు. పట్టిసీమ విషయంలో జాప్యం జరిగినా.. టెండర్ నిబంధనలే అడ్డగోలుగా మార్చేసిన ప్రభుత్వం, తమతో అవగాహన కుదుర్చుకున్న కాంట్రాక్టర్‌కు నజరానా చెల్లించకుండా ఎందుకుంటుంది? అని అధికారులే అంటున్నారు.