సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
విజయవాడ: పోలవరం ప్రాజెక్టును తాము కడతామని టీడీపీ తీసుకోవడం వల్లే చిక్కులు మొదలయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..
కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కీలక అంశాలపై ప్రతిపక్షంతో ఎందుకు సీఎం సంప్రదింపులు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం సంస్కారం ఏమయ్యిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం పాతాళానికి తొక్కేస్తున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఆలోచన ఈ సీఎంకు లేదని వ్యాఖ్యానించారు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని,11 జాతీయ విద్యా సంస్థలకు రూ.6,600 కోట్లు రావాల్సి ఉండగా..కేంద్రం కేవలం రూ. 450కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం పెట్టిన ఖర్చుకు ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు అనే మాట సీఎం నోటి నుంచి రావడం బాధాకరమన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. మరో స్వతంత్ర పోరాటం అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు.
బీజేపీపై పోరాటానికి అందరూ ముందుకు రావాలని కోరారు.ఎన్నికల సంస్కరణలు అవసరమని, ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరుగుతోందని,35 శాతం ముఖ్యమంత్రులు నేర నేపథ్యం కలిగిన వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం తమ ఆదాయ వివరాలను ప్రకటించాలన్నారు. టీడీపీలోని అవినీతి ప్రజాప్రతినిధుల వ్యవహారంను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమంతోనే సమాధానమిస్తామని చెప్పారు. ఈ విషయంపై రేపు వామపక్ష పార్టీలతో పాటు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment