బాబు వచ్చాడు.. జాబులు పోయాయి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందన్న ఎన్నికల వాగ్దానం నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 79,224 తగ్గడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. బుధవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
2013 డిసెంబర్ 31 నాటికి 5.67 లక్షలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2016 జనవరి నాటికి 4.88 లక్షలకు తగ్గిపోయిందన్నారు. విభజన సమయంలో కమలనాథన్ కమిటీ లెక్కకట్టిన 1.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోగా రెండేళ్లలో 79,224 ఉద్యోగులను తగ్గించేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు.