
సాక్షి, కడప : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దాడి సంఘటనపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో సెక్కూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. జగన్ అనుచరులే దాడి చేశారనటం చిత్రవిచిత్రంగా ఉందని అన్నారు. అభిమానులు కూడా నాయకులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఈ దాడిని సీపీఎం పూర్తిగా ఖండిస్తోందని అన్నారు. ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. జగన్‌కు మరింత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అభిమాని అంటూ చెప్పడం విచారణ చేసే అధికారుల ఉత్సాహంపై నీళ్లు చల్లడమేనని మండిపడ్డారు. దాడిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలు ఉంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని అన్నారు.