కడప అగ్రికల్చర్/కార్పొరేషన్: టీడీపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో ఎంతోకాలం పాలన సాగించలేదని వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. శనివారం కడప నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళిక రచించి జగన్‌పై హత్యాయత్నం చేసిందన్నారు. ఓ పత్రికాధినేత, ముఖ్యమంత్రి, నటుడు శివాజీ ఆపరేషన్ గరుడలో ప్రధాన కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆపరేషన్ గరుడపై ఇదివరకే విచారణ చేసి ఉండాలన్నారు. 30 ఏళ్లుగా చంద్రబాబు అటు «అధికారంలో, ఇటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తనకు ఎవరూ అడ్డు ఉండకూడనే కుట్రతోనే ఇలా చేశారని ఆరోపించారు. సీఎం తలుచుకుంటే కుర్రకుంకలతో హత్య చేయించరని, భారీగా ప్లాన్ ఉంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పకనే చెప్పారన్నారు.
హత్యాయత్నం వెనుక ఎన్నో కుట్రలుఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ ప్రభుత్వం ఎన్నో రకాల కట్టుకథలు అల్లి వైఎస్‌ఆర్‌సీపీకి అంటగడుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు.నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్‌టీఆర్ హౌసింగ్ స్కీంలో రెండు ఇళ్లు జన్మభూమి కమిటీ మంజూరు చేసిందని, అతను రకరకాల సెల్‌ఫోన్లు మార్చి మాట్లాడాడని, అతని బ్యాంకు బ్యాలెన్స్ చాలా ఉన్నట్లు పోలీసులే చెబుతున్నారన్నారు. అలాగే నిందితుడు గ్రామంలో ఇచ్చిన డిన్నర్‌లోనే ప్రజలకు పలు విషయాలు చెప్పాడన్నారు.
టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి హోటల్‌లో నిందితుడు పని చేస్తున్నాడని తేల్చిన పోలీసులు, మరి టీడీపీ నాయకుల హస్తం ఉందని ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసరావును వెంటనే అదుపులోకి తీసుకున్నప్పుడు అతని వద్ద ఉన్న వస్తువులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. వైఎస్ జగన్ వీరాభిమానికి టీడీపీ నాయకుడు హోటల్‌లో ఎలా ఆశ్రయం కల్పించారని సామాన్య ప్రజలు చర్చికుంటున్నారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు హత్యకు యత్నించిన వ్యక్తిని కూడా కొనుగోలు చేసి ఉంటారని ఆనుమానం వ్యక్తం చేశారు. డీజీపీ చేత సీఎం చంద్రబాబు తప్పుడు ప్రకటన చేయిస్తున్నారని మండిపడ్డారు.
డీజీపీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సంఘటన జరిగిన కొద్దిసేపటికే శ్రీనివాసరావు క్రేజీ కోసం, జగన్ సీఎం కావాలని ఇలా కత్తితో దాడి చేశాడని చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకముందే డీజీపీ ఠాకూర్ ప్రకటన చేయడం విచిత్రంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌కు కొత్తగా ప్రజాదరణ అవసరం లేదని, ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తేనే ఇది అర్థమవుతుందన్నారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకు ప్రభుత్వం జెడ్‌ప్లస్ భద్రత కల్పించి కాపాడాలని, లేనిపక్షంలో ప్రభుత్వం అతన్ని అంతమొందించి వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే అతన్ని చంపి ఆ నెపం వైఎస్‌ఆర్‌సీపీపై వేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థతో విచారణ చేపట్టాలి
కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ హత్యాయత్నం దుర్మార్గమైనదని ప్రజలు, ప్రతిపక్షపార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. దేవుళ్ల దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ జగన్‌కు పెద్ద గండం తప్పిందని అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో ఎల్లకాలం పాలన సాగించలేరని హెచ్చరించారు. ఆపరేషన్ గరుడ పేరుతో ప్రకటనలు చేస్తున్న నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలా పకడ్బందీగా జగన్‌ను అంతమొందించడానికి టీడీపీ నాయకులు పెద్ద కుట్ర పన్నారని తేటతెల్లమవుతుందన్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం, మంత్రుల మాటలు జుగుప్సాకరం
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉందన్నారు. మా కార్యకర్తలు తలుచుకుంటే వైఎస్ జగన్‌ను ఖైమా కొట్టినట్లు తునాతునకలు చేసేవారని ఎంపీ కేశినేని మాట్లాడిన పద్ధతి చూస్తే నిజమే అనిపిస్తోందన్నారు. ఆపరేషన్ గరుడ అనేది భారీగా జరుగుతున్న కుట్ర అన్నారు. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ఇలాంటి కుట్రలు ఉంటాయని, ఆ సంస్కృతి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రయోగిస్తున్నారని విరుచుకుపడ్డారు.సీఎం, మంత్రులు వైఎస్ జగన్‌పై మాట్లాడిన మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment