వైఎస్సార్ జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు చూస్తుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్లాన్ చేసి చంపేందుకు ప్రయత్నించినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని కడప వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజద్ బాష తెలిపారు. మంగళవారం మైదుకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాజంపేట పార్లమెంటు వైస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డిలతో కలిసి పార్టీ కార్యాలయంలో అంజద్ బాష విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబులోని రాక్షసత్వం ఇప్పుడు బయటపడిందని అంజద్ భాషా వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులకి ఒక్క జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే అడ్డుగా ఉన్నారు.. అందుకే పథకం ప్రకారం ఆయన్ను తుదముట్టించాలని చూశారని పేర్కొన్నారు.
మా కార్యకర్తలను రెచ్చగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ నాయకులు ఎన్ని చేసినా మా కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు, ఉంటారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిల చేయించారనడానికి సిగ్గుండాలని తీవ్రంగా మండిపడ్డారు. అలిపిరి సంఘటన వెనక నారా భువనేశ్వరీ, లోకేష్‌లు ఉన్నారని అంటే మీరు ఒప్పుకుంటారా అని సూటిగా అడిగారు. ఆపరేషన్ గరుడ కర్త, కర్మ, క్రియ ఎవరో రాష్ట్ర ప్రజలకి తెలియాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు కత్తితో దాడి చేస్తే టీడీపీ నేతలు ఫోర్క్ అనడం ఏమిటని ప్రశ్నించారు. దాడి జరిగిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏదైనా జరిగితే అడిగే హక్కు గవర్నర్‌కు లేదా అని సూటిగా టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ కేసులో కీలక నిందితుడు హర్షవర్దన్ చౌదరీ, లోకేష్‌కు ప్రియ శిష్యుడని వెల్లడించారు. అందుకే చర్యలు లేవని చెప్పారు. ఘటన జరిగిన గంటకే ఎలాంటి విచారణ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు వైఎస్‌ఆర్‌సీపీ వీరాభిమాని అని చెప్పిన డీజీపీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావని, స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడి కులం పేరు చెప్పడం దారుణమన్నారు. వైఎస్‌జగన్ హైదరాబాద్ చేరకముందే డీజీపీ స్పందించడంపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి అవహేళనగా మాట్లాడటం హేయమైన చర్య అని అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తే ఆ విజ్ఞత మన ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. కేంద్రం మీద నెట్టే దానికే పాదయాత్రలో కాకుండా ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేశారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment