దొంగల్లా దోచేస్తున్నారు
దొంగల్లా దోచేస్తున్నారు
Published Tue, Apr 11 2017 12:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో దొంగలు పడ్డారు. కుడి ప్రధాన కాలువ పనుల పేరుతో కృష్ణా జిల్లాకు పెద్దఎత్తున ఇసుక తరలించుకుపోతున్నారు. అభివృద్ధి ముసుగులో అక్రమ దందా సాగిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి సమీపంలోని మహానందీశ్వర క్షేత్రం వద్ద పెద్దఎత్తున తవ్వకాలు సాగిస్తూ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌తోపాటు బయటి ప్రాంతాలకు భారీగా ఇసుక తరలించుకుపోతున్నారు. అభివృద్ధి పనులకు ఇసుక కేటాయించాలంటేప్రభుత్వ అనుమతి అవసరం. కానీ.. ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు యంత్రాల సాయంతో ఇక్కడ తవ్వకాలు సాగిపోతున్నాయి.
మంత్రిగారి అండతో..
కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి అండతో ఇక్కడ ఇసుక అక్రమ దందా నడుస్తోంది. సదరు మంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాల కారణంగా అధికారులెవరూ అటు కన్నెత్తి చూడటం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం నుంచి గోదావరి ఏటిగట్టు మీదుగా భారీ వాహనాల్లో దర్జాగా తరలించుకుపోతున్నా కిమ్మనడం లేదు.
యంత్రాలూ ప్రాజెక్ట్‌వే
మహానందీశ్వర క్షేత్రం వద్ద రెండు యంత్రాలతో రేయింబవళ్లు ఇసుక తవ్వుతున్నారు. పెదవేగి, హనుమాన్‌జంక్షన్ పరిసర ప్రాంతాల్లో పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు ఇక్కడి ఇసుకను వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. కాలువ పనులకు ఇసుక తోలేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవు. పైగా.. ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుకను ఆ పనులకు వినియోగించడం లేదు. ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ యంత్రాలనే ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్నారు. ఇలా తవ్విన ఇసుకను వందలాది వాహనాల్లో తరలించుకుపోతున్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు దీనిని ఉపయోగిస్తున్నట్టు చెబుతూ బయటి ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు నెల రోజులుగా తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి.
ప్రమాదకరంగా ఏటిగట్టు ప్రాంతం
ఇసుక తవ్వకాలు, రవాణా వాహనాల రాకపోకల వల్ల పోలవరం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలు వేగంగా వెళ్తుండటంతో పోలవరంలోని ఏటిగట్టు సెంటర్ ప్రమాదకరంగా మారింది. ఈ సెంటర్ మీదుగా వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల గ్రామంలోని కొందరు యువకులు ఇసుక తరలిస్తున్న ఓ లారీని ఆపి ప్రశ్నించగా, ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో యువకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు కొద్దిసేపటికే దానిని వదిలేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేయడం, ఆయన రంగంలోకి దిగటంతో లారీని వదిలేసినట్టు సమాచారం.
Advertisement
Advertisement