ఏలూరు : మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 2.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. అయితే, కేవలం 1.30 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. 700 ఎకరాల భూసేకరణ ప్రధాన సమస్యగా ఉండటంతో 70వేల ఎకరాలకు నీరందించే విషయంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. భూములివ్వాల్సిన రైతుల నష్టపరిహారం పెంచాలని కోరగా, ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడం లేదు. ఫలితంగా తాడిపూడి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఇదిలావుంటే.. ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని 7వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 2003లో శంకుస్థాపన చేసిన గిరమ్మ ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది.
పుష్కర కాలమైనా పనులు పూర్తి కాలేదు. దీనికి రూ.8 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరందించలేని దుస్థితి నెల కొంది. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలం వెంకటాపురం, తూర్పుయడవల్లి గ్రామాలకు గిరమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరివ్వాలి. కామవరపుకోటలో భూమిలో పైప్‌లైన్లు వేశారు. దొరసానిపాడులోనూ అదేవిధంగా పైప్‌లైన్లు వేయాలని ఇక్కడి రైతులిద్దరు కోర్టును ఆశ్రయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తికాగా, 2010 ఆగస్టులో ట్రయల్ రన్ వేసి వదిలేశారు. కాలువలు తవ్వి, భూమిలో పైప్‌లైన్లు వేస్తే ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు.
చిక్కుల నడుమ చింతలపూడి
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 15 మెట్ట మండలాల్లో 230 గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీని నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,701 కోట్ల నిధులు కేటాయించారు. 2008 అక్టోబర్ 30న ఈ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకానికి 2,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 500 ఎకరాలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. దీనికోసం పట్టిసీమ వద్ద 25,560 హార్స్‌పవర్ గల పంప్‌హౌస్, కాలువల తవ్వకం పనులు కొంతమేర చేపట్టారు. 12 టీఎంసీల నీటిని 28 కిలోమీటర్ల మేర దిగువకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రధానమైన పనులేమీ ప్రారంభించలేదు.
అక్కడక్కడా 40,588 ఎకరాలకు..
నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 28 చిన్నపాటి ఎత్తిపోతల పథకాల ద్వారా 40,588 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇందులో బుట్టాయగూడెం మండలంలో గాడిదబోరు-1, గాడిదబోరు-2 పంపుహౌస్‌ల నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. వీటితోపాటు శిరగాలపల్లి-1, శిరగాలపల్లి-2, మైప, పిప్పర, కేశవరం, కొప్పర్రు గ్రామాల్లో చిన్నపాటి ఎత్తిపోతల పథకాలతో 16,128 ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచి నీరు అందించాలని నిర్ణయించారు.
ఉత్తిపోతలు
Published Sat, Jun 13 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement