‘బ్లడీ’ఫెలోస్‌తో బహుపరాక్! | illigal blood business | Sakshi
Sakshi News home page

‘బ్లడీ’ఫెలోస్‌తో బహుపరాక్!

Published Mon, Aug 17 2015 3:45 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

నకిలీ లేబుల్, సంచులతో రక్తం దందా జరుగుతున్న హుజూరాబాద్ రెడ్‌క్రాస్ కేంద్రం - Sakshi

నకిలీ లేబుల్, సంచులతో రక్తం దందా జరుగుతున్న హుజూరాబాద్ రెడ్‌క్రాస్ కేంద్రం

- రక్తంతో అక్రమార్కుల దందా.. నకిలీ బ్లడ్ ప్యాకెట్లు, లేబుళ్లతో వ్యాపారం
- హుజూరాబాద్ ‘రెడ్‌క్రాస్’లో వెలుగుచూసిన వ్యవహారం
- ప్రైవేట్ నర్సింగ్ హోంల నుంచి తీసుకొచ్చి విక్రయం
- పరీక్షలు లేకుండానే రక్త సేకరణ.. అసురక్షిత పద్ధతుల్లో నిల్వ
- ప్యాకెట్లపై బ్లడ్ గ్రూప్ కూడా లేని వైనం
- దందా వెనుక పెద్ద రాకెట్!.. అదుపులో ల్యాబ్ టెక్నీషియన్
- కొనసాగుతున్న విచారణ... గవర్నర్ దృష్టికి వెళ్లిన విషయం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రక్తనిధి కేంద్రాల్లో తనిఖీలు
 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
అమ్మమ్మకు ఆపరేషన్ .. వైద్యులు రక్తం కావాలనడంతో ఆమె మనవడు నరేశ్ రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన రక్తనిధి కేంద్రానికి వెళ్లాడు.. డబ్బులు చెల్లించి రెండు ప్యాకెట్ల రక్తం తీసుకొచ్చి వైద్యులకిచ్చారు.. రక్తాన్ని పరిశీలించిన డాక్టర్లు నోళ్లు తెరిచారు! ఆ ప్యాకెట్‌పై లేబుళ్లు నకిలీవి! ఆ ప్యాకెట్లూ నకిలీవి! చివరికి అందులో తీసుకువచ్చిన రక్తం కూడా సంస్థది కాదు!! ఆ బ్లడ్ ఏ గ్రూప్‌నకు చెందిందో కూడా తెలియదు!! మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నెత్తురుతాగే గత్తరగాళ్లు సాగిస్తున్న ఈ ‘రక్తం దందా’ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వెలుగుచూసింది.

దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పరీక్షలు చేయకుండా ప్రైవేట్ నర్సింగ్ హోంలు సేకరించే రక్తాన్ని తీసుకువచ్చి, దాన్ని నకిలీ లేబుళ్లతో తయారు చేసిన ప్యాకెట్లలో తక్కువ మోతాదుల్లో నింపి సొమ్ము చేసుకుంటున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ఈ దందా సాగిస్తుండడం గమనార్హం.

వెలుగులోకి వచ్చిందిలా...
లక్ష్మి అనే వృద్ధురాలు మోచేతి ఆపరేషన్ కోసం ఇటీవల జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రక్తం తక్కువగా ఉందని, రెండు ప్యాకెట్ల రక్తం తీసుకురావాలని సూచించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 10న హుజూరాబాద్‌లోని రెడ్‌క్రాస్ రక్తనిల్వల కేంద్రానికి వెళ్లి రెండు ‘బి’ పాజిటివ్ రక్తం ప్యాకెట్లు కావాలని అడిగారు. రక్తనిధి కేంద్రంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ వారి నుంచి రూ.4 వేలు తీసుకుని రెండు రక్తపు సంచులు అందజేశాడు. ప్యాకెట్లు తీసుకొచ్చి ఆస్పత్రిలో ఇవ్వగా.. వాటిని పరిశీలించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతోనే ఆ సంచులు ఉన్నప్పటికీ అందులో 300 ఎంఎల్ ఉండాల్సిన రక్తం 125 ఎంఎల్ మాత్రమే ఉంది. ఆ ప్యాకెట్‌పై రక్తం ఏ గ్రూపు అనేది కూడా ముద్రించలేదు. ఆ సంచులపై అంటించిన లేబుల్ నకిలీదిగా తేలింది. ఐస్ ప్యాకింగ్ కూడా లేదు. అనుమానం వచ్చిన వైద్యులు రెడ్‌క్రాస్ సొసైటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.

రక్త నిల్వలు సీజ్!
వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సిద్దుల బాలకృష్ణ జమ్మికుంట ఆస్పత్రికి వెళ్లి బ్లడ్‌బ్యాంక్ నుంచి తెచ్చిన రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రోగి నుంచి తీసుకున్న డబ్బులను చెల్లించారు. ఉచితంగా మరో రెండు రక్తం ప్యాకెట్లను అందజేశారు. హుజూరాబాద్‌కు వెళ్లి రక్తపు యూనిట్లు ఉంచిన ఫ్రిజ్‌ను తనిఖీ చేశారు. అక్కడున్న రక్తపు సంచులపై అనుమానం రావడంతో బ్లడ్‌బ్యాంక్‌ను సీజ్ చేశారు. బాధ్యుడైనటెక్నీషియన్‌ను గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ర్ట ప్రతినిధులకు కూడా సమాచారం పంపారు.

గవర్నర్ దృష్టికి దందా..
రెడ్‌క్రాస్ సొసైటీ పేరుతో నకిలీ లేబుళ్లు, రక్తపు సంచులు తయారు చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద రాకెట్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లినట్లు సమాచారం. రెడ్‌క్రాస్ సంస్థ అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సంస్థకు చెందిన రక్తనిధి కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రాకెట్ వెనుక సూత్రధారి, పాత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ సాగుతోంది.

దర్యాప్తు జరుగుతోంది
హుజూరాబాద్‌లో జరుగుతున్న వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. చర్యలు తీసుకుంటున్నాం. సోమవారం హుజురాబాద్ వెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. జిల్లా కలెక్టర్‌తో కూడా సమావేశమవుతా
 - ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధాన క్యాదర్శి మదన్‌మోహన్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement