పీజీ వరకూ నాణ్యమైన విద్యనందించాలి
Published Sun, Oct 2 2016 12:03 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
నల్లజర్ల : దేశ విద్యా విధానాన్ని సంస్కరించడం, పునర్నిర్మించడం, పరిపుష్టి చేయడం పేరుతో ప్రభుత్వం బహిరంగ చర్చకు పెట్టిన జాతీయ విద్యావిధానం ముసాయిదాను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సదస్సు తిరస్కరించింది. నల్లజర్ల జెడ్పీ హైస్కూల్ ఆవరణలో శనివారం డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.కృష్ణయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. అభివృద్ధి నిరోధక బోధనా దుకాణాలకు ఊతమిచ్చే ముసాయిదా స్థానంలో సామాజిక ఉత్పత్తి విధానానికి అనుగుణమైన కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను కామన్ స్కూల్ రూపంలో సమాజానికి అందించాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ సదస్సులో నూతన విద్యా విధానంపై అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యుడు సీఎస్‌ఆర్ ప్రసాద్, ప్రొఫెసర్ ఎం.రవికుమార్, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ రమణయ్య, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొణతం నరహరి మాట్లాడారు. డీఈవో డి.మధుసూదనరావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఎన్‌రోల్‌మెంట్ పెరిగే విధంగా చూడాలని సూచించారు. పిల్లల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయ వృత్తికే మనుగడ ఉండదన్న విషయం గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహార్, ఎంపీడీవో చిన్నారావు, మండల సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షుడు యలమాటి శ్రీనివాసరావు, ఎంఈవో ఐడీవీ అప్పారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement