
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
– రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం
దేవరకొండ :
పట్టామార్పిడికి లంచం ఇవ్వాలంటూ వేధించిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా పని చేస్తున్న రాగ్యానాయక్ ప్రస్తుతం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీటీగా డిప్యుటేషన్‌పై పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో డిండి మండలం కామేపల్లికి చెందిన ఓ రైతు నుంచి పట్టా మార్పిడి కోసం రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయగా సదరు రైతు ఫిర్యాదు మేరకు స్పందించిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మాటు వేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన రైతు కొమ్మెర లక్ష్మణ్‌రావు తల్లి మృతి చెందగా ఆమె పేరిట ఉన్న 3.31 గుంటల వ్యవసాయ భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు లక్ష్మణ్‌రావుకు రావాల్సిన భూమిని ఆమె అత్త తరుపు బంధువులకు పట్టా చేశారు. 2012లో ఈ విషయమై మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఇందుకు సంబంధించి సదరు భూమి లక్ష్మణ్‌రావుకు చెందుతుందంటూ అప్పీలు సమర్పించారు. ఆ మేరకు సదరు భూమి లక్ష్మణ్‌రావుకు చెందుతుందంటూ ఉన్నతాధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించిన కాపీని ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న రాగ్యానాయక్ నుంచి పొందడానికి కొన్ని రోజులుగా లక్ష్మణ్‌రావు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇందుకోసం లక్ష్మణ్‌రావు కొడుకైన కిరణ్ నుంచి రాగ్యానాయక్ రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. చివరకు బేరసారాల అనంతరం రూ.10వేలు ఇవ్వడానికి కిరణ్ ఒప్పుకోగా ఇప్పటికే కిరణ్ 10 రోజుల క్రితం రాగ్యానాయక్‌కు అందించాడు. ఈ పరిస్థితికి విసిగి వేసారిన కిరణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు డీఎస్పీ కోటేశ్వర్‌రావు, సీఐలు శ్రీనివాస్‌రావు, లింగయ్యలు రాగ్యానాయక్‌ను మంగళవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దేవరకొండ డివిజన్‌లో అధికారుల తీరు ఇంతే :
గత ఏడాది క్రితమే దేవరకొండ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి పట్టా పేరు మార్పిడికై ఓ రైతు నుంచి రూ. 16వేలు లంచంగా తీసుకుంటుండగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.