► 66 పనుల్లో 46 టెండర్లు ఎక్సెస్‌కే...!
► పగిడీలతో పనుల పంపకాలే కారణం
► పోటీదారుణ్ని తప్పించిన కాంట్రాక్టర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో 14వ ఆర్థిక సంఘం నిధుల టెండర్లు రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూ.6.95 కోట్ల నిధులతో చేపట్టనున్న 66 పనుల్లో 46 పనులకు సింగిల్ షెడ్యూళ్లు దాఖలు కావడం, కాంట్రాక్టర్లు వేలంపాటలు నిర్వహించి పనులు, పగిడీల పంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించడంతో బల్దియూ అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. టెండర్లకు సంబంధించి గురువారమే ప్రైస్‌బిట్ తెరవాల్సి ఉండగా, కమిషనర్ గత రెండు రోజులుగా కార్యాలయ పనులపై హైదరాబాద్‌కు వెళ్లడంతో అది సాధ్యపడలేదు. గురువారం సాయంత్రమే టెండర్ల ఫైల్ కమిషనర్ టేబుల్‌పైకి వెళ్లినట్లు తెలిసింది. వివాదాస్పదంగా మారిన ఈ టెండర్లపై కమిషనర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
ఇన్నాళ్లు కాంట్రాక్టర్ల హవా కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుత టెండర్లలో కూడా కాంట్రాక్టర్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సింగిల్ టెండర్లు ఎక్సెస్ రేట్లకు వేస్తే మాత్రం వాటిని రద్దు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ దాఖలు చేయడానికి ముందే అసోసియేషన్‌కు డబ్బులు చెల్లించడం, సింగిల్ టెండర్లే కదా అని ఎక్సెస్ రేట్లకు వేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే టెండర్లు రద్దు పరచడం ఖాయంగా కనిపిస్తోంది.
పోటీదారున్ని తప్పించిన కాంట్రాక్టర్లు..!
టెండర్లలో కొన్ని పనులకు పోటీపడ్డ ఓ స్థానికేతర కాంట్రాక్టర్ పోటీనుంచి తప్పుకునే విధంగా స్థానిక కాంట్రాక్టర్లు ఒత్తిడి తేవడంతో తాను పనులు చేయలేనని, ప్రైస్‌బిట్‌లో తమ షెడ్యూల్‌ను తెరవవద్దని లేఖ రాసి ఇచ్చినట్లు సమాచారం. అలాగే పోటీలో ఉన్న మరో ఇద్దరిని కూడా తప్పించి అన్ని పనులకు సింగిల్ షెడ్యూళ్ల ద్వారా స్థానిక కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునే అవకాశం చిక్కినట్లే.
నిబంధనల ప్రకారమే... - కృష్ణభాస్కర్, కమిషనర్
14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన టెండర్లకు సంబంధించిన ఫైల్‌ను పరిశీలిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో సింగిల్ టెండర్లు పడితే మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం.
టెండర్ల రద్దుకే మొగ్గు..?
Published Fri, Jun 24 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement