మద్దిలో ముగిసిన హనుమద్ జయంతి
మద్దిలో ముగిసిన హనుమద్ జయంతి
Published Thu, May 25 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
జంగారెడ్డిగూడెం రూరల్ : హనుమద్ నామ స్మరణతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆల యం మార్మోగింది. ఈ క్షేత్రంలో జరుగుతున్న హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమత్ దీక్షధారులు బుధవారం స్వామి సన్నిధిలో తమ ఇరుముళ్లను సమర్పించారు. మహా పూర్ణాహుతి హోమ గుండంలో తమ ఇరుముళ్లలోని నెయ్యిని సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకుల బృందం, వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పంచామృతాలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, పసుపు, కుంకుమ, సింధూరంతో అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, ఆలయ కార్వనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలను తిలకించారు. బుధవారంతో క్షేత్రంలో హనుమద్ జయంతి ఉత్సవాలు నేత్ర పర్వంగా ముగిశాయి.
హంసవాహనంపై అంజన్న
బుధవారం రాత్రి మద్ది ఆంజనేయస్వామి, సువర్చలాదేవి అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. హంస వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గుర్వాయిగూడెం పుర వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవం నేత్ర పర్వంగా సాగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement