నిట్‌లో 83 సీట్లు ఖాళీ
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో చేరేందుకు చివరిరోజుగా అవకాశం కల్పించిన బుధవారం ఒకే ఒక్క విద్యార్థి రిపోర్టు చేశారు. చివరి అవకాశం ముగిశాక ఏపీ నిట్‌లో 83 సీట్లు ఖాళీగా మిగిలాయి. నిట్‌లో 480 సీట్లు ఉండగా, హోమ్ స్టేట్ కోటా కింద 240, ఇతర స్టేట్‌ల కోటా కింద 240 సీట్లు భర్తీ చేస్తారు. నిట్‌లో చేరేందుకు విజయవాడ రిపోర్టింగ్ సెంటర్‌లో 420 మంది విద్యార్థులు ఇనీషియల్ డిపాజిట్ చేశారు. వారిలో చివరిరోజు బుధవారం నాటికి 397 మంది విద్యార్థులు ఏపీ నిట్‌లో రిపోర్ట్ చేశారు. చివరి అవకాశం కూడా అయిపోవడంతో ఇక ఈ సీట్లను భర్తీ చేసే అవకాశం లేదు. వాస్తవానికి మంగళవారం చివరి అవకాశం కాగా ఒక రోజు పెంచారు. దీనిని ఒక్క విద్యార్థి మాత్రమే వినియోగించుకున్నారని ఏపీ నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్ తెలిపారు. నెలాఖరుకు తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహ నిర్మాణ పనులు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తికాకపోవడంతో వచ్చేనెల 19 నుంచి తరగతులు నిర్వహించనున్నారు.
మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపు
నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాను, డీపీఆర్ నాలుగు కీలక సమావేశాల అనంతరం తుది రూపు తీసుకువచ్చారు. గత శనివారం దీనిపై సమావేశం జరిగాక ఢిల్లీలోని ఎడ్యూసెల్, ఏపీ నిట్, వరంగల్ నిట్, పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంట్ అధికారులు కలిసి మాస్టర్‌ప్లాను, డీపీఆర్ సిద్ధం చేశారు. ప్లాను, వివరాలను కేంద్ర మానవవనరుల అభివద్ధి మంత్రిత్వశాఖకు పంపించేందుకు నిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సదరు మంత్రిత్వశాఖ మాస్టర్ ప్లాను ఆమోదించి, అక్కడి నుంచి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపించాలి. క్యాబినెట్ సబ్ కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపిన తర్వాత నిర్మాణాలకు సంబంధించి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదంతా జరగడానికి పది రోజులకుపైనే సమయం పట్టవచ్చు. 2030 వరకు నిట్‌లో ఎంతమంది ఫ్యాకల్టీలు అవసరమవుతారని, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎంత మంది అనే విషయాలతో పాటు అప్పటికీ రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లు అవకాశం కాగలరనే అంచనాలు డీపీఆర్‌లో పొందుపరిచినట్టు సమాచారం.