జాతీయ రహదారిపై నిత్యం కనిపించే ట్రాఫిక్ కోన్స్
తణుకు: జాతీయ రహదారి నిర్వహణ పేరుతో సిబ్బంది అవలంభిస్తున్న విధానాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధి పనుల పేరుతో ఇటీవల మరమ్మతులు చేపట్టారు. అయితే గత కొన్నేళ్లుగా మరమ్మతుల పేరుతో నిత్యం ట్రాఫిక్ మళ్లిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సుదీర్ఘంగా సాగుతున్న పనులు
తద్వారా పలువురు వాహనదారులు మృత్యువాత పడుతుండగా పదుల సంఖ్యలో వాహనదారులు గాయాల పాలవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి నిర్వహణ పనులకు వినియోగిస్తున్న భారీ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా తణుకు మండలం దువ్వ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే నిర్వహణ వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని పదో తరగతి చదువుతున్న బాలిక మరణించింది. ఇలాగే గతంలో సైతం పలువురు మృత్యువాత పడ్డారు.
నిత్యం ట్రాఫిక్ మళ్లింపే
పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి తాడేపల్లిగూడెం వరకు దాదాపు 50 కిలోమీటర్లు మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. జాతీయ రహదారి నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు దాదాపు రెండేళ్ల క్రితం ఒక కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా ఈ రోడ్డులో నిత్యం మరమ్మతులు చేస్తుండటంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. దీంతో రోడ్డుకు మధ్య భాగంలో ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
* మంగళవారం దువ్వలో జరిగిన ప్రమాదంలో రోడ్డు డివైడర్‌లో మొక్కలకు నీళ్లు పోసే వాటర్‌ట్యాంకర్ మోటారు సైకిల్ ను ఢీకొట్టడంతో బాలిక అక్కడిక్కడే మరణించింది.
* ఇటీవల డీమార్ట్ సమీపంలో సైతం మోటారు సైకిల్‌పై వెళ్తున్న మహిళ రోడ్డు డివైడర్‌పై పడి మృతి చెందారు.
* పెరవలి మండలానికి చెందిన మరో వ్యక్తిని హైవే నిర్వహణ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
* ఉండ్రాజవరం జంక్షన్ వద్ద సిగ్నల్ వద్ద వేచి ఉన్న యువకుల మోటారు సైకిల్‌ను వెనుక నుంచి వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు.
* ఇటీవల అలంపురం సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన మహిళ మృతి చెందగా ఆమె కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
* దువ్వ జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో గొయ్యిలో పడి ఒక యువకుడు మృతి చెందాడు.
నాసిరకం పనులు
జాతీయ రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. మరోవైపు పగలు సమయాల్లో మాత్రమే మరమ్మతు పనులు చేపడుతూ రోడ్డు మళ్లింపు చేపట్టాల్సి ఉంది. అయితే జాతీయ రహదారి నిర్వహణ సిబ్బంది మాత్రం రాత్రి సమయాల్లో సైతం ట్రాఫిక్ కోన్స్ అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఒక్కోసారి మరమ్మతు పనులు చేయపోయినప్పటికీ రోడ్డు మార్గం మళ్లిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి ఆనుకుని గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా జాతీయ రహదారి నిర్వహణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment