Repair of roads
-
ఆ నేషనల్ హైవేలో ఎప్పుడూ రిపేర్లేనా? ప్రమాదాలు పట్టించుకోరా?
తణుకు: జాతీయ రహదారి నిర్వహణ పేరుతో సిబ్బంది అవలంభిస్తున్న విధానాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధి పనుల పేరుతో ఇటీవల మరమ్మతులు చేపట్టారు. అయితే గత కొన్నేళ్లుగా మరమ్మతుల పేరుతో నిత్యం ట్రాఫిక్ మళ్లిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న పనులు తద్వారా పలువురు వాహనదారులు మృత్యువాత పడుతుండగా పదుల సంఖ్యలో వాహనదారులు గాయాల పాలవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి నిర్వహణ పనులకు వినియోగిస్తున్న భారీ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా తణుకు మండలం దువ్వ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే నిర్వహణ వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని పదో తరగతి చదువుతున్న బాలిక మరణించింది. ఇలాగే గతంలో సైతం పలువురు మృత్యువాత పడ్డారు. నిత్యం ట్రాఫిక్ మళ్లింపే పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి తాడేపల్లిగూడెం వరకు దాదాపు 50 కిలోమీటర్లు మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. జాతీయ రహదారి నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు దాదాపు రెండేళ్ల క్రితం ఒక కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా ఈ రోడ్డులో నిత్యం మరమ్మతులు చేస్తుండటంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. దీంతో రోడ్డుకు మధ్య భాగంలో ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. * మంగళవారం దువ్వలో జరిగిన ప్రమాదంలో రోడ్డు డివైడర్‌లో మొక్కలకు నీళ్లు పోసే వాటర్‌ట్యాంకర్ మోటారు సైకిల్ ను ఢీకొట్టడంతో బాలిక అక్కడిక్కడే మరణించింది. * ఇటీవల డీమార్ట్ సమీపంలో సైతం మోటారు సైకిల్‌పై వెళ్తున్న మహిళ రోడ్డు డివైడర్‌పై పడి మృతి చెందారు. * పెరవలి మండలానికి చెందిన మరో వ్యక్తిని హైవే నిర్వహణ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. * ఉండ్రాజవరం జంక్షన్ వద్ద సిగ్నల్ వద్ద వేచి ఉన్న యువకుల మోటారు సైకిల్‌ను వెనుక నుంచి వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. * ఇటీవల అలంపురం సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన మహిళ మృతి చెందగా ఆమె కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. * దువ్వ జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో గొయ్యిలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. నాసిరకం పనులు జాతీయ రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. మరోవైపు పగలు సమయాల్లో మాత్రమే మరమ్మతు పనులు చేపడుతూ రోడ్డు మళ్లింపు చేపట్టాల్సి ఉంది. అయితే జాతీయ రహదారి నిర్వహణ సిబ్బంది మాత్రం రాత్రి సమయాల్లో సైతం ట్రాఫిక్ కోన్స్ అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కోసారి మరమ్మతు పనులు చేయపోయినప్పటికీ రోడ్డు మార్గం మళ్లిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి ఆనుకుని గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా జాతీయ రహదారి నిర్వహణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
Telangana: రూ.3 వేల కోట్లు.. 4 వేల కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రోడ్లను మెరుగుపరిచే నిర్వహణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మెరుగుపరచాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. అలాగే గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని వాహనదారులకు నరకాన్ని చూపుతున్న రోడ్లను కూడా బాగు చేయనున్నారు. ఇందుకు రూ.3 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోడ్లను అద్దాల్లా మెరిసేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కదలిక వచ్చింది. గతంలోనూ నిధుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు రూపొందించి వాటి విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించిన నేపథ్యంలో నిధులు వెంటనే మంజూరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల పరిమితితో సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల కానున్నాయి. ఏడో వంతు మాత్రమే.. రాష్ట్ర రహదారుల విభాగం పరిధిలో 28 వేల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇందులో ఇప్పుడు 4 వేల కి.మీ. పరిధిలో మాత్రమే పనులు జరగనున్నాయి. అంటే ఏడో వంతు మాత్రమే. ప్రతిరోడ్డుకు ఐదేళ్లకోసారి రెన్యూవల్ పనులు జరగాలని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ చెప్తోంది. అయితే అది ఖర్చు తో కూడుకున్న వ్యవహారం అయినందున కనీసం ఏడేళ్లకోసారి అయినా మరమ్మతు జరగాలన్నది నిపుణుల మాట. రాష్ట్రంలో 28 వేల కి.మీ. రాష్ట్ర రహదారులున్నందున ప్రతియేటా 4వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఈ రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కొన్నింటిని పూర్తి చేశారు. వీటి నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డ కొత్త రోడ్లనే రెన్యువల్స్‌గా భావిస్తున్నారు. అవి తప్ప విడిగా రోడ్డు రెన్యువల్ పనులు చేపట్టలేదు. ఫలితంగా చాలా రోడ్లు బలహీనపడ్డాయి. గత మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ పనులకు నిధులులేక.. బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించి వాటిని మెరుగు పరిచేందుకు ఆదేశాలివ్వటంతో సుదీర్ఘ విరామం తర్వాత వాటికి మంచిరోజులు రాబోతున్నాయి. రూ.3 వేల కోట్లలో దాదాపు రూ.700 కోట్లు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేటాయించారు. -
24 గంటల్లోగా రహదారుల గుంతల పూడ్చివేత
నగరంలో అధ్వానపు రోడ్లతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోడ్ల నిర్వహణ..భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం రోడ్ల నిర్మాణ వ్యయంలో కొంత శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ నిధులతో సిటీలో ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు, ఇతర పనులు చేపడతారు. రాకపోకలు సాఫీగా, సౌకర్యవంతంగా జరిగేలా చూస్తారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రాబోయే రోజుల్లో గుంతల్లేని రోడ్లు దర్శనమివ్వనున్నాయా..? రోడ్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు సత్వరం చేపట్టనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. రోడ్ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎందరో గాయాల పాలవుతుండటం.. మరణాలు చోటు చేసుకుంటుండటం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని కఠినమైన రోడ్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని భావించింది. ఈ అంశంపై దాదాపు రెండు నెలల క్రితం వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఇందులో రోడ్‌సేఫ్టీ కోసం ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు రోడ్లు, ఫ్లై ఓవర్లు తదితర ఇంజినీరింగ్ పనులు చేసేప్పుడు వాటిల్లో కొంతశాతం నిధులు రోడ్‌సేఫ్టీ కోసం కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ నిధులతో భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. అందుకుగాను రోడ్ సేఫ్టీ అమలుకు ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆమేరకు ముసాయిదా బిల్లు రూపొందించినట్లు తెలిసింది. అవసరమైన పక్షంలో సదరు బిల్లుకు తగిన మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ఆమోదం అనంతరం అమల్లోకి తేనున్నారు. ఇంజినీరింగ్ పనుల్లో ఎంత శాతాన్ని రోడ్ సేఫ్టీ కోసం కేటాయించాలనేదానిపై తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు రెండు శాతం కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. జీహెచ్ఎంసీకి సంబంధించి అంతమొత్తం కేటాయించే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేవు. రహదారులు, ఫ్లై ఓవర్లు తదితరమైన వాటికి బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వినియోగిస్తున్నారు. వాటికి వడ్డీ కట్టాల్సి వస్తోంది. అంతే కాకుండా గ్రేటర్లో చేపట్టాల్సిన పనులు దాదాపు 25 వేల కోట్ల మేర ఉండటంతో రెండు శాతం అంటే.. భారీ నిధులు కేటాయించాల్సి ఉన్నందున జీహెచ్ఎంసీకి సంబంధించి 0.25 శాతం లేదా 0.50 శాతం కేటాయించినా చాలుననే అభిప్రాయాలున్నాయి. ఎంత శాతమనేది ఖరారై, బిల్లు కార్యరూపం దాల్చాక సదరు నిధులతో ఎప్పటికప్పుడు రహదారుల మరమ్మతులు సత్వరం చేస్తారు. రోడ్లపై పడే గుంతల్ని 24 గంటల్లోగా పూడ్చివేస్తారు. తద్వారా నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. తక్షణ మరమ్మతు బృందాలు మరిన్ని పెరగాలి.. విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా రోడ్ల మరమ్మతులు చేసేందుకు, పాట్‌హోల్స్ వెంటనే పూడ్చివేసేందుకు 79 తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్టీ) ఉన్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలపగా, వాటిని ఇంకా పెంచాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ఏడాది పొడవునా నగరంలోని అన్ని రోడ్లు ఎలాంటి పాట్‌హోల్స్ లేకుండా ఉండాలని, దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని సూచించారు. ఇందుకుగాను తగినన్ని ప్రీమిక్స్ బీటీ బ్యాగుల్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ కమిషనరేట్ ఏర్పాటు అవసరం కూడా అధికారుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. -
రోడ్ల మరమ్మతులకు రూ.124 కోట్లు
టెలీమీట్‌లో మంత్రి హరీష్ వెల్లడి సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో, అంతర్ జిల్లాలను కలుపుతూ రహదారుల మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 124.25 కోట్లను మంజూరు చేసిందని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం రాత్రి ఆయన టెలీమీట్‌లో నిధులను వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు. జీఓ నం. 129, 130, 131 ప్రకారం మెదక్, కరీంనగర్, వరంగల్ రహదారులను కలుపుతూ, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రధాన రోడ్ల మరమ్మతుకు నిధులు విడుదలయ్యాయన్నారు. ప్రధానంగా డబుల్ రోడ్లు, నాలుగు లేన్ల రోడ్ల విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. సిద్దిపేట బైపాస్ గుండా నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, నంగునూరు నుంచి ఖాతా వరకు డబుల్ రోడ్ నిర్మాణం కోసం రూ. 8.5 కోట్లు, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు ప్రస్తుతం రూ. 10 కోట్లతో జరుగుతున్న డబుల్‌రోడ్ నిర్మాణాన్ని పొడిగించేందుకు 3 కిలో మీటర్ల రహదారి కోసం ప్రభుత్వం రూ. 3.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదే విధంగా ఇబ్రహీంపూర్ నుంచి మాచాపూర్ వయా చింతమడక నుంచి దుబ్బాక వరకు రహదారి నిర్మాణం కోసం రూ. 12 కోట్లు, అదే విధంగా జక్కాపూర్ నుంచి గోపులాపూర్, మాటిండ్ల, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, చింతమడక మీదుగా మెదక్ రోడ్డు వరకు రహదారి నిర్మాణం కోసం రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. పొన్నాల బైపాస్ నుంచి ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల వయా తిమ్మారెడ్డిపల్లికి రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. సిద్దిపేట నుంచి తొగుట రహదారి మార్గమధ్యలో ఎన్సాన్పల్లి, తడ్కపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2 కోట్లను రహదారుల శాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయన్నారు.