ప్రపంచ శాంతిని ఆకాంక్షించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఇస్లాం శాంతి మార్గా న్ని ప్రబోధిస్తోంది.. సర్వ మానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి ఆకాంక్షిస్తూ అపకారం తలపెట్టిన వారికి కూడా ఉపకారం చేసి దేవుడి (అల్లా) కృపకు పాత్రులు కావాలని’ ఇస్లామిక్ పండితులు ఉద్బోధించారు. ఆదివారం హైదరాబాద్ నగర శివారులోని పహాడీ షరీఫ్‌లో జరుగుతున్న ఇస్లామిక్ సమ్మేళనం(ఇజ్తేమా)లో ఉదయం ప్రార్థనల అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన మౌలానా ముర్సాలియిన్, లక్నోకు చెందిన మౌలానా షౌకత్, బెంగుళూరుకు చెందిన మౌలానా ఖాసీం ఖురేషీ, మౌలానా అస్లాంలు సుదీ ర్ఘంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. రెం డో రోజు సుమారు మూడున్నర లక్షల మంది హజరయ్యారు.
స్కాలర్లు ప్రసంగిస్తూ పుట్టిన ప్రతి జీవీ గిట్టక తప్పదని, మానవ జన్మకు కూడా మరణం తప్పదన్నారు. మానవ జీవితాన్ని ప్రసాదించిన సృష్టికర్త ఒక్కొక్కరికీ ఒక్కోలా పరిస్థితులు సృష్టించి సహనాన్ని పరీక్షిస్తాడన్నారు. మహ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గంలో పయనిస్తూ, మంచిని ప్రబోధిస్తూ చెడును దూరం చేయాలన్నారు. కర్తవ్యాన్ని మరచి అరాచకం, దౌర్జన్యం మార్గంలో ప్రయాణిస్తే దేవుడి కృప కోల్పోవడం ఖాయమన్నారు.
అసౌకర్యాలు...
ఇజ్తేమాలో అసౌకర్యాలతో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ స్థాయి ఇజ్తేమాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించి.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. ఏర్పాట్లలో విఫలమైంది. ఇజ్తేమాకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని ముందస్తుగానే అంచనా వేసినప్పటికీ పూర్తి స్థాయిలో షామియానాలను ఏర్పాటు చేయలేదు. దీంతో నలుమూలల నుంచి వచ్చిన వారు ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేందుకు, ఐదు పూటలు ప్రార్థనలు చేసేందుకు షామియానాలు సరిపోక ఇబ్బందులకు గురయ్యారు. దుమ్ముధూళితో వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. భోజనశాలలు కూడా సరిపడినన్ని ఏర్పాటు చేయకపోవడంతో చాంతాడు క్యూలు తప్పలేదు. మరోవైపు పహాడీ షరీఫ్ రోడ్డు మార్గం దుమ్ముమయంగా మారింది.
నేడు ఇజ్తేమా ముగింపు
పహాడీషరీఫ్‌లో రెండురోజులపాటు కొనసాగుతున్న తబ్లిక్ జమాత్ ఇస్లామిక్ ఇజ్తేమా సోమవారం ముగియనుంది. ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా ముస్తాక్, మౌలానా ఖాసీం ఖురేషీ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. సమ్మేళనం ముగింపు సందర్భంగా సుదీర్ఘంగా ప్రత్యేక దువా (అల్లాను వేడుకోలు) కార్యక్రమం నిర్వహిస్తారు.