
గెలుపోటములు సమానంగా తీసుకోవాలి
గుంతకల్లు : జయాపజయాలను సమానంగా స్వీకరించి, స్ఫూర్తిని చాటాలని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ (ఎస్‌సీఆర్ ఏజీఎం) ఏకే.గుప్తా సూచించారు. స్థానిక రైల్వే మైదానంలో బుధవారం సాయంత్రం సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 22వ స్టేట్ (జోనల్ స్ధాయి) ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ రైల్వే డివిజన్ల నుంచి వందలాది మంది స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు.
వ్యాసరచన, నృత్యాలు, డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్, ఫిజికల్ డిస్‌ప్లే కాంపిటీషన్, స్కౌట్స్ విద్యార్థులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, క్యాంపుఫైర్ తదితర విభాగాల్లో నాలుగు రోజులు స్కౌట్స్ విద్యార్థులకు పోటీలు ఉంటాయి. డీఆర్‌ఎం బీజీ మాల్య మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ గైడ్స్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గనితే 94 ఏళ్ల వయసులోనూ దేశంలో ఈవెంట్లు ఎక్కడ జరిగినా హాజరవుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 22వ సేట్ట్ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. జోనల్ పరిధిలోని వివిధ డివిజన్‌లకు చెందిన రైల్వే పాఠశాలల విద్యార్థులు పెరేడ్ ద్వారా ఏజీఎం ఏకే.గుప్తా గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ కమిషనర్ పద్మజ, స్టేట్ కార్యదర్శి ఎస్‌కే. గుప్తా, ఏడీఆర్‌ఎం సుబ్బరాయుడు, సీనియర్ డీపీఓ బలరామయ్య, ఆర్‌పీఎఫ్ గుంతకల్లు రైల్వే డివిజన్ సెక్యూరిటీ కమాండెంట్ ఏలీషా, సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.