క్షమించు.. చెల్లీ! | Indumati funerals end, parents tearful send off | Sakshi
Sakshi News home page

క్షమించు.. చెల్లీ!

Published Mon, Mar 7 2016 6:42 PM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM

క్షమించు.. చెల్లీ! - Sakshi

క్షమించు.. చెల్లీ!

- ముగిసిన ఇందుమతి అంత్యక్రియలు
- శోకసంద్రంలో చాటపర్రు

 
 ఏలూరు రూరల్ : ప్రేమోన్మాదానికి బలైన ఇందుమతి అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఫలితంగా చాటపర్రు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం  శవ పంచనామా ముగిసిన తర్వాత ఇందుమతి మృతదేహాన్ని పోలీసులు ప్రత్యేక వాహనంలో పోలీసుల బందోబస్తు మధ్య చాటపర్రుకు తరలించారు. గ్రామంలో మృతదేహాన్ని కిందకు దించగానే కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు.  తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి సత్యనారాయణతోపాటు తాత, తమ్ముడు మృతదేహంపై పడి బావురుమన్నారు. గ్రామస్తులు భారీగా వచ్చి ఇందుమతి మృతదేహాన్ని దర్శించి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉన్న శ్మశానంలో ఇందుమతి అంత్యక్రియలు పూర్తిచేశారు.  
 
 చదువంటే ప్రాణం
 ఆడపిల్లలు చదువుకుంటేనే అందరూ గౌరవిస్తారని అక్క చెప్పేదని ఇందుమతి తమ్ముడు చందు కన్నీటిపర్యంతమయ్యాడు. తన అక్కకు చదువంటే ప్రాణమని, డిగ్రీ వరకూ చదివి, ఉద్యోగం చేస్తానని చెప్పేదని గుర్తుచేసుకున్నాడు. కానీ ప్రేమోన్మాదులు అక్కను చదువుకోనీయలేదని, చదువు మానేసి ఇంటిలోనే ఉండిపోయినా వదల్లేదని విలపించాడు.
 
 పోలీసులు పట్టించుకోలేదు
 ఇందుమతి ఇంటిపై నిందితులు గతంలోనే దాడిచేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ఇంతటి ఘోరం జరిగిందని పలువురు మహిళలు తీవ్రంగా విమర్శించారు. గత బుధవారం ఇందుమతి ఇంటిపై పెద్దవిక్కీ, చిన్నవిక్కీ తన స్నేహితులతో కలిసి వచ్చి దాడి చేశారని గుర్తు చేశారు. పథకం ప్రకారం ముందుగానే స్థానిక ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ తీసేసి వీధిలైట్లు ఆర్పేసి వచ్చి ఇందుమతి కుటుంబసభ్యులపై దాడి చేశారని, అయినా పోలీసులు పట్టంచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
 చెరుకు రసం తెచ్చా తాగమ్మా..!
 ఇందుమతికి చెరుకు రసం అంటే చాలాఇష్టమని ఆమె తల్లిదండ్రులు రోదించారు. పుట్టిన రోజైనా, పండగ రోజైనా చెరుకు రసం కావాలనేదని, బాగా చదువుకుంటే  ఏం కావాలన్నా కొనిపెడతామని అంటే బాటిల్ నిండా చెరుకు రసం ఇప్పిస్తారా అని ప్రశ్నించేదని వారు గుర్తుచేసుకున్నారు. ఇందుమతికి ఇష్టమైన చెరుకు రసాన్ని ఆమె సమాధిపై పోసి తల్లిదండ్రులు కడసారి వీడ్కోలు పలికారు. ‘తాగమ్మా.. తాగు.. నీకు ఇష్టమైన చెరుకు రసం తెచ్చాను’ అంటూ ఆమె తండ్రి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్నవారి గుండెలను పిండేసింది.  
 
 న్యాయం చేస్తాం :  నన్నపనేని
 ఇందుమతికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. ఆదివారం ఉదయం ఆమె చాటపర్రు వచ్చి ఇందుమతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంటల్లో కాలిపోతూ ఇందుమతి పడిపోయిన బాత్‌రూంను ఆమె  పరిశీలించారు. ఘటనపై పోలీసులను ఆరా తీశారు.  
 
 ఆస్పత్రి వద్ద ప్రజాసంఘాల ఆందోళన
 ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఇందుమతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా ప్రధాన ఆస్పత్రి వద్ద ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ కార్యక్రమంలో ఇందుమతి తల్లిదండ్రులూ పాల్గొన్నారు.  ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుమతి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డగించారు.   మహిళా కమిషన్ రాష్ర్ట చైర్‌పర్సన్  నన్నపనేని రాజకుమారి ఆస్పత్రికి వచ్చి ఇందుమతి మృతదేహాన్ని పరిశీలించి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనకారులు ఆమెను నిలదీశారు. అసహనంగానే వారితో మాట్లాడిన నన్నపనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఘటనను రాజకీయం చేయబోయి నన్నపనేని అభాసుపాలయ్యారు. బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి నన్నపనేనిని నిలదీయడంతో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇక్కడ ఉండడానికి వీలులేదంటూ రాజకుమారి హుకుం జారీ చేశారు. దీంతో అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను రాజకీయం చేయొద్దని హెచ్చరించారు. నిందితులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడాలని ఆమెను ఘెరావ్ చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను పక్కకు ఈడ్చివేసి నన్నపనేనిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
 
 ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న ఇందుమతి మేనమామ సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ హఠాత్తుగా విలేకరుల కెమెరాల వైర్లను మెడకు బిగించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను నిలువరించారు. ప్రథమ చికిత్సకు తరలించారు. అనంతరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణం రూ.2.50 లక్షల ఆర్థిక సాయం  అందించాలని ఏలూరు ఆర్డీఓ తేజ్ భరత్‌ను ఆదేశించారు. అనంతరం ఇందుమతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడానికి పోలీసులు యత్నించగా, వారు తీసుకెళ్లేందుకు తిరస్కరించారు. కలెక్టర్, ఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పెదపాడు తహశీల్దార్ జి.జె.ఎస్.కుమార్ వచ్చి కలెక్టర్, ఎస్పీలు శివరాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పట్టిసీమ వెళ్లారని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement